బూర్గంపాడు: కంటి సంబంధిత రుగ్మతలను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చూపు మందగించడంతో పాటు ఇతర కంటి రుగ్మతల నివారణకు ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. మూడునెలల పాటు అన్ని గ్రామ పంచాయతీలలో కంటి వైద్య శిబిరాల నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలందరికీ ఈ వైద్య శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 12 వైద్య బృందాలతో కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా బృందాలకు శిక్షణ నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలకు, ఆశ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు. ఒక్కో బృందంలోముగ్గురు ఆప్తాల్మిక్ అధికారులు, అయా పీహెచ్‌సీల పరిధిలోని వైద్యులు, సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఉంటారు.
మూడునెలల పాటు శిబిరాలు...
వైద్య బృందాలు మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు ఈ క్యాంపుల నిర్వహణ సాగుతుంది. కంటి వైద్య శిబిరాలను విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటారు. వైద్య శిబిరాల నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను అయా గ్రామ పంచాయతీలకే అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ శిబిరాలకు అవసరమైన మెడికల్ కిట్లను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ వైద్య, విజ్ఞాన కేంద్రం వారు కంటి వైద్య శిబిరాలకు అవసరమైన 6000 కిట్లను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధం చేశారు. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెల 25 నుంచే కంటి వైద్యశిబిరాలను జిల్లాలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
ఇళ్ల వద్దనే వైద్యపరీక్షలు...
ఐదు దశల్లో కంటి వైద్యపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ముందుగా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన కిట్ల సాయంతో దృష్టి లోపం ఉన్నవారిని గుర్తిస్తారు. లోపం ఉన్న వారిని శిబిరం నిర్వహించే రోజు కంటి వైద్యనిపుణల వద్దకు తీసుకొస్తారు. అక్కడవారికి ప్రత్యేకమైన యంత్రాలతో పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్నవారికి శిబిరంలోనే ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తారు. కంటి శుక్లాలు, కాటరాక్ట్, గ్లూకోమా వంటి లోపాలున్న వారిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేస్తారు. జఠిలమైన సమస్యలుంటే హైదరాబాద్‌కు తరలించి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పర్యవేక్షణలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment