ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రేషన్ షాపుల్లో ఉచితంగా కిలో కందిపప్పు పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే నెల బియ్యం కోటాతో పాటు పప్పును కూడా అందించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం విదితమే. తాజాగా వచ్చే నెలలో కిలో చొప్పున కంది పప్పు పంపిణీ చేయనున్నారు. మే నెల మొదటి వారంలో బియ్యంతో పాటు కార్డుకు కిలో చొప్పున పప్పును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాకు కందిపప్పు స్టాక్ చేరుకుంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బస్తాలను నిలువ ఉంచారు. నాలుగైదు రోజుల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానున్న సందర్భంగా లారీల్లో బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు బస్తాలను కూడా రేషన్ దుకాణాలను రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు 3,90,687 ఉన్నాయి. కార్డుకు కిలో చొప్పున జిల్లాకు 390 మెట్రిక్ టన్నుల కోటా అవసరం అవుతోంది. అయితే లూజ్‌గానే డీలర్లు పప్పును తూకం వేసి ఇవ్వనున్నారు.
మొన్నటిలాగే బియ్యం పంపిణీ...
మే నెలలో కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకు 16 వేల మెట్రిక్ టన్నుల కోటా అవసరం కానుంది. మొన్నటిలాగే ఇప్పుడు కూడా మే నెల మొదటి వారం నుంచి లబ్ధిదారులకు టోకెన్ పద్ధతిలో బియ్యం ఇవ్వనున్నారు. బియ్యం, కందిపప్పు బస్తాలను రేషన్ దుకాణాలకు తరలించడానికి లారీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment