హైదరాబాద్ : మహరాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్(86) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉదయం గోడేకికబర్ నయీ బస్తీలోని ఆయన నివాసానికి లక్ష్మీనారాయణ పార్థివ దేహాన్ని తీసుకురావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, స్థానికులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో లక్ష్మీనారాయణ ముదిరాజ్ (1969-70) నగర మేయర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే గన్‌పార్కులోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంతో అప్పటి ప్రభుత్వం ఆయనను జైలుకు పంపింది.అనంతరం 1972 నుంచి 1978 వరకు మహరాజ్ గంజ్ ఎమ్మెల్యేగా (ప్రస్తుతం గోషామహల్), బీసీ కమిషన్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా, ఏపీ టింబర్ మర్చెట్స్ సంఘ అధ్యక్షునిగా ఆయన పనిచేశారు. ఎగ్జిబిషన్ సొసైటీకి సీనియర్ సభ్యుడైన లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ను ఈ ఏడాది జనవరి 1వ తేదీన సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో
సీఎం ఆదేశాలతో లక్ష్మీనారాయణ అంత్యక్రియలను బుధవారం సాయంత్రం పురానాపూల్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టారు. ఈ ఏర్పాట్లను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, మాజీ మంత్రి, సీఎల్పీ నేత ఎమ్మెల్యే కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి నరోత్తమరెడ్డి, ఎకనామిక్ కమిటీ కార్యదర్శి వనం వీరేందర్, మాజీ కార్యదర్శి ఆర్.సుఖేష్‌రెడ్డి, కోశాధికారి అనిల్‌స్వరూప్ మిశ్రా, ఇతర ప్రతినిధులు నివాళులర్పించారు.అంతిమ యాత్రలో భాగంగా గన్‌పార్క్‌వద్దకు తెచ్చిన లక్ష్మీనారాయణ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తూళ్ల ఉమా, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగం జనార్థనరెడ్డి, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతోపాటు పలు పార్టీల నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సీఎం సంతాపం
లక్ష్మీనారాయణ ముదిరాజ్ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా సేవలు అందించిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఊతంగా నిలిచారని కొనియాడారు. అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్తూపం నిర్మించే విషయంలో ఎంతో చొరవ, ధైర్యం ప్రదర్శించారని అభిప్రాయపడ్డారు.
గన్‌పార్కుకు లక్ష్మీనారాయణ పేరు పెట్టాలి
దివంగత లక్ష్మీనారాయణ పేరును గన్‌పార్కుకు పెట్టాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ బుధవారం లేఖను రాసింది.ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, నాగయ్య, కుమార్‌రావు, లక్ష్మణ్‌గౌడ్, దామోదర్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, అధికారప్రతినిధి కృష్ణమోహన్‌రావు తదితరులు లక్ష్మీనారాయణ బౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు.
స్వాతంత్య్ర యోధుడు లక్ష్మీనారాయణ కన్నుమూత
Published Thu, Mar 5 2015 4:26 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement