‘ప్రణాళిక’కు కసరత్తు
కలెక్టరేట్/మందమర్రి రూరల్ : ప్రజల అవసరాలు, వసతులు, వనరులను దృష్టిలో పెట్టుకుని గ్రామ, మండల, పట్టణ, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ప్రణాళికల ఆధారంగా నిధులు కేటాయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రణాళిక వ్యూహరచన ప్రతిష్టాత్మకంగా జరిగేందుకు మండలస్థాయి అధికారులతోపాటు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఉన్నతాధికారులను ప్రత్యేక ప్రణాళిక అధికారులుగా నియమించారు.
దీంతో ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నిండుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన ప్రణాళిక’పై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గ్రామ, వార్డుల్లో ప్రణాళిక తయారీకి నమూనా రూపొందించి దాని ఆధారంగా గ్రామ, వార్డు అభివృద్ధితోపాటు వనరులు, ప్రజావసరాలకు అవసరమగు అంశాలు అందులో పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రణాళిక తయారీ కార్యక్రమం జిల్లాలో ఆరు రోజులపాటు జరగనుంది. కాగాా, శనివారం తలమడుగు మండ లం రుయ్యాడి గ్రామంలో మంత్రి జోగు రామన్న ‘మన ఊరు-మన ప్రణాళిక ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలతో సమావేశం కానున్నారు. సమావేశానికి కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు.
ఇది ఉద్దేశం..
స్థానిక వనరులు, వసతులు, ప్రజావసరాలు కేంద్రంగా తెలంగాణ దృక్పథం ప్రతిబింబించేలా భౌతిక ఆర్థిక పరిస్థితులు పరిగణంలోకి తీసుకుని ప్రణాళికను తయారు చేయడం.
ప్రాధాన్యత అంశాలు
వ్యవసాయం, అనుబంధ రంగాలు, తాగునీరు, చిన్న నీటి వనరులు తెలంగాణకు హరిత హారం-అడవుల పెంపకం, స్మృతి వనాలు, పారిశుధ్యం, డంపింగ్ యార్డ్‌లు, విద్య, వైద్యం, పరిశ్రమలు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోరకు భూమి కొనుగోలు, ఉమ్మడి స్మశాన వాటికల ఏర్పాటు.
ప్రణాళికల రూపకల్పనకు ముందు కసరత్తు
గ్రామ స్థితిగతులపై విశ్లేషణ, మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగమయ్యే అన్ని అంశాలు పరిగణంలోకి తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల లభ్యత, వాటి వృద్ధిపై దృష్టి సారించాలి. ఉత్పత్తి ఉత్పదక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వివిధ రకమైన వనరుల కేటాయింపులకు అంచనాలు వేయాలి. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల మధ్య సమన్వయం పాటించాలి.
మండల స్థాయిలో ప్రణాళికలు
గ్రామస్థాయి ప్రణాళికలు ఆధారంగా చేసుకుని మండల స్థాయి అవసరాలు అందులో పొందుపర్చి మండల స్థాయి ప్రణాళికలు నపొందుపర్చాలి. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారుల భాగస్వామ్యంతో తయారు చేసిన ప్రణాళికను మండల పరిషత్ ఆమోదంతో జిల్లాకు పంపాలి.
జిల్లాస్థాయి ప్రణాళికలు
మండల స్థాయి ప్రణాళికను ఆధారం చేసుకుని జిల్లాస్థాయి అవసరాలను పొందుపర్చి ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళికను జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు అమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది.
గ్రామప్రణాళిక తయారి
‘మన ఊరు.. మన ప్రణాళిక’ రూపకల్పనకు గ్రామ పంచాయతిని ప్రాథమిక యూనిట్‌గా తీసుకుంటారు. ప్రణాళిక రూపకల్పనకు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గ్రామ ప్రణాళిక తయారులో ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల భాగాస్వామ్యంతో గ్రామ స్థాయిలో ఉండే అధికారులతో గ్రామ ప్రణాళికను తయారు చేస్తారు. గ్రామ ప్రణాళికలో ముఖ్య అంశాలు.. సహజ మనవ వనరుల గుర్తింపు, మౌలిక వసతుల లభ్యత, ఆవశ్యకత గుర్తించుట, వ్యవస్థాగత ఏర్పాట్లు భవిష్యత్ లక్ష్యసాధనకు పత్రాన్ని రూపొందించడం. ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంతోపాటు తక్షణ అవసరాల నిమిత్తం, వార్షిక ప్రణాళిక రూపకల్పన గ్రామ ప్రణాళికను గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించే సభలో ఆమోదించాలి.
సిబ్బంది నియామకం
ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వారితోపాటు ఐకేపీ అధికారి ఇతర గ్రామ స్థాయి అధికారులలో ఒకరిని సహాయకులుగా తీసుకోవాలి. అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. జిల్లా స్థాయిలో ప్రణాళికల తయారికి ప్రాధన్యత అంశాల శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక విభాగం అధికారులు గ్రామ స్థాయి నుంచి అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయ పరుస్తూ ప్రణాళికలు రూపొందించాలి.
శిక్షణా తరగతులు
ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇచ్చే నిమిత్తం రిసోర్స్ పర్సన్‌ళ్ల ఎంపిక జిల్లా, మండల స్థాయిలో జరుగాలి. జిల్లా రిసోర్స్ పర్సన్ మండల రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ఇస్తారు. అలాగే మండల రిసోర్స్ పర్సన్ గ్రామ ప్రణాళిక తయారీలో పాలు పంచుకోని సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.