
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. సమ యం సమీపిస్తుండడం, దసరా హడావుడి ముగియడంతో ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం అన్ని రాజకీయపార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే నెలన్నర రోజులుగా ప్రజాక్షేత్రంలో ఉన్న టీఆర్‌ఎస్ రూటు మారుస్తోంది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు చేసిన పలు సూచనల మేరకు ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ దూకుడు పెంచింది. అదే విధంగా కాంగ్రెస్ తరఫున దాదాపు టికెట్లు ఖరారు అనుకున్న నేతలు కూడా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక ప్రచారానికి ఊపు తీసుకొచ్చేందుకు వీఐపీల పర్యటనలు కూడా పెరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం జరగనున్న నారాయణపేట, మహబూబ్‌నగర్, మక్తల్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాలకు కేంద్ర మంత్రి ఎం.నడ్డా, ఆ పార్టీ శాసనసభాపక్ష మాజీ నేత జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే, ఈనెల 24న బుధవారం నాగర్‌కర్నూల్‌లో జరిగే టీఆర్‌ఎస్ యువ గర్జన సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరవుతున్నారు. ఇలా మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల మలి విడత ప్రచారం జోరందుకుంది.
వ్యూహం మారుస్తున్న టీఆర్‌ఎస్
ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా ముందు కు తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజారిటీ స్థానాలు గెలుపొందాలన్న లక్ష్యంతో పార్టీ అధి ష్టానం పావులు కదుపుతోంది. అందులో భాగం గా పాలమూరు ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్... బరిలో నిలిచే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున లబ్ధి పొందిన వారిని అభ్యర్థులు కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు. అందులో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీప్ ఫండ్, వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన జాబితానుగ్రామాల వారీగా సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారందరికీ సీఎం కేసీఆర్ పేరుతో రాసిన లేఖలను కూడా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు కార్యకర్తలందరితో సమావేశాలు ఏర్పాటుచేసి ఓటింగ్ విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. అంతేకాదు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు తరచుగా పార్టీ ముఖ్యనేతల పర్యటనలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ నెల 24న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ యువగర్జన సమావేశానికి హాజరవుతున్నారు.
అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఓట్లు, సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ కూడా దూకుడు పెంచింది. నవరాత్రి ఉత్సవాలు ముగియడం, అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి వివాదాలు లేకుండా సింగిల్ అభ్యర్థిత్వం ఉన్న వాటికి అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కల్వకుర్తికి తన్నోజు ఆచారి, అచ్చంపేటకు మల్లేశ్వర్, గద్వాలకు రాజా వెంకటాద్రిరెడ్డి, మక్తల్‌కు కొండయ్య, నారాయణపేటకు రతంగ్‌పాండురెడ్డి అభ్యర్థిత్వాలను అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది. ఈసారి పోటాపోటీ ఉన్న నేపథ్యంలో కొన్ని స్థానాలైనా గెలుపొందాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టింది.
కార్యకర్తలను మరింత అప్రమత్తం చేసేందుకు పార్టీ ముఖ్యులు రంగంలోకి దిగారు. నారాయణపేట నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి రతంగ్‌పాండు రెడ్డికి మద్దతుగా ప్రచారం కోసం మంగళవారం తాజా మాజీ ఫ్లోర్ లీడర్ జి.కిషన్‌రెడ్డి రానున్నారు. నియోజకవర్గంలోని మొత్తం 263 బూత్‌ల ఉండగా.. ఒక్కొక్క బూత్‌నుంచి 25 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఇలా మొత్తం మీద ఒక్క నియోజకవర్గం నుంచి 7వేల మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు. అలాగే, మక్తల్, మహబూబ్‌నగర్‌లో కూడా మంగళవారమే సమావేశాలు ఏర్పాటుచేశారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి నడ్డా, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇలాగే ప్రతీ నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలు పొందేందుకు కసరత్తు చేస్తున్నారు.
‘హస్తం’లో ఉత్సాహం
పాలమూరు ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలమైన ఫునాది ఉండడంతో మంచి ఫలితాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ చైతన్యయాత్రను దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా చేపట్టడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఎన్నికల బరిలో ఎవరెవరు బరిలో నిలుస్తారో అధిష్టానం ప్రకటించకపోయినా.. చూచాయగా పేర్కొనడంతో ఆయా అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్ ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు గద్వాల, కొడంగల్, వనపర్తి, అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తిలో అభ్యర్థులెవరనేది స్పష్టం కావడంతో వారు ప్రచారంలో మునిగిపోయారు. అలాగే మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలుగా ఉన్న వారు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటనతో కేడర్‌లో జోష్ వచ్చినట్లయింది. త్వరలో మరో సారి రాహుల్ రాష్ట్రానికి రానుండడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు.