భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరఘాట్లు జనంతో నిండారుు.. పదోరోజు గురువారం కూడా జిల్లాలోని అన్ని ఘాట్లకు జనం పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు చేసే భక్తులతో ఘాట్లు కళకళలాడాయి. ఎనిమిది ఘాట్లకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. భద్రాచలంలోని ఘాట్లలో సుమారు రెండు లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తుల రాక అధికంగా ఉండటంతో రహదారులు వాహనాలతో నిండిపోయాయి.
కొత్తగూడెం నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో భద్రాచలంతోపాటు ఇతర ఘాట్లకు చేరుకునేందుకు వాహనాలకు మూడు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం నుంచి భద్రాచలానికి హాజరైన భక్తులు తిరుగుముఖం పట్టడంతో రామాలయం దారి నుంచి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేరట్రాఫిక్ స్తంభించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. దర్శనం క్యూలైన్లు జనంతో నిండిపోయాయి. రామయ్య దర్శనానికి నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పట్టింది.
పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబ సమేతంగా రామాలయంలో పూజలు చేశారు. మోతె ఘాట్‌లో మాజీ ఎమ్మెల్యే సంభాని చంద్రశేఖర్ పుష్కరస్నానం చేశారు. మణుగూరులోని ఘాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. చిన్నరావిగూడెంలో రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయం ప్రారంభించారు. ఏపీలోని నర్సారావుపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబసమేతంగా చిన్నరావిగూడెంలో స్నానమాచరించారు.
అటు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇటు భట్టి పుష్కరస్నానం
భద్రాచలంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పుష్కరస్నానం చేసింది. అనంతరం గోదావరి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ పుష్కర స్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటే ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత భోజనం, టిఫిన్ సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సతీసమేతంగా భద్రాచలంలో పుష్కరస్నానం చేశారు. గోదావరి ఘాట్లను పరిశీలించారు. దేవుడి పేరుతో ప్రభుత్వం ప్రజాధనం దోచుకుంటోందని ఆరోపించారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
వాహనాల రద్దీ ప్రమాదాలకు దారితీస్తోంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు వాహనాల రాకపోకలు భారీగా ఉన్నారుు. కొత్తగూడెం సమీపంలోని రేగళ్ల వద్ద టాటాఎస్‌ను మినీ బస్సు ఢీ కొట్టడంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన బానోత్ కిరణ్ (6), డ్రైవర్ బానోత్ బాలకృష్ణ (35) మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. భద్రాచలం ఘాట్ వద్ద కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు (50) అనే వ్యక్తి బీపీతో మరణించాడు.
‘అమ్మ’ ఒడిలో..
Published Fri, Jul 24 2015 2:43 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement