భద్రత పటిష్టం | Full Safety And Security For Nampally Numaish | Sakshi
Sakshi News home page

భద్రత పటిష్టం

Published Sat, Nov 9 2019 9:56 AM | Last Updated on Sat, Nov 9 2019 9:56 AM

Full Safety And Security For Nampally Numaish - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటెల రాజేందర్‌

గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1 నుంచి నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్‌)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్‌ మైదానంలో సొసైటీ పాలకమండలి సభ్యులతో కలిసి వివరాలను వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీని స్థాపించినట్లు తెలిపారు. గత 79 ఏళ్లుగా ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎప్పుడూ జరగని దుర్ఘటన గతేడాది చోటుచేసుకుందని, అలాంటి ప్రమాదాలు మరోకసారి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖ సూచనల మేరకు ఈ ఏడాది స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. స్టాల్‌ యజమానులు, సందర్శకులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం మైదానంలోని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి డాక్టర్‌ బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్‌.సురేందర్, సంయుక్త కార్యదర్శి హన్మంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

భద్రతలో ప్రధానమైనవి ఇవీ..
గతేడాది జరిగిన సంఘటన దృశ్యా ఈసారి మైదానంలో పైభాగాన ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించి అంతర్గతంగా అమరుస్తున్నారు.  
ప్రతి స్టాల్‌కు అండర్‌గ్రౌండ్‌ నుంచే విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆటోమెటిక్‌గా విద్యుత్‌ ఆగిపోయేలా బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు.  
మైదానంలోని ఇరువైపులా 1.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ఫైర్‌ వాటర్‌ సంపులనునిర్మిస్తున్నారు.
ఎగ్జిబిషన్‌ మైదానం చుట్టూ అంతర్గతంగా వాటర్‌ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.  
మైదానంలో కొన్ని ప్రాంతాల్లో ఫైర్‌ బకెట్లు, వాటర్‌ బారెల్స్, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. అగ్నిప్రమాదం జరిగితే ఫైర్‌ ఇంజిన్‌ తిరగడానికి వీలుగా తగినంత స్థలం వదిలిపెడుతున్నారు.  
ఈ ఏడాది స్టాల్‌ యజమానులు తమ స్టాళ్లల్లో వంట చేసుకోవడానికి గ్యాస్‌ స్టవ్‌లను అనుమతించడం లేదు.  
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు వీలుగా గేట్ల సంఖ్యను పెంచుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement