వచ్చే నెల 14 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18 వేల మంది పోలీసులు అవసరమవుతారని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18 వేల మంది పోలీసులు అవసరమవుతారని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో జరిగే పుష్కరాలకు స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలు, కర్ణాటక నుంచి పోలీసులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎస్పీలు, సంబంధిత డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు జిల్లాల్లో 106 పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేస్తుండగా, లక్షల సంఖ్యలో భక్తులు వ చ్చే అవకాశముందని ఆయన చెప్పారు.
స్థానిక భాషల్లో భక్తులకు సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖమ్మం జిల్లాలో కోయ ప్రజలు వాడే భాషలో సూచనలు అందించాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్ భగవత్, శాంతి భద్రతల అదనపు డీజీపీ సుదీప్ లక్తకియా , కమ్యూనికేషన్స్ అదనపు డీజీపీ రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు.