నిధులన్నీ బొక్కారు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘మాది స్నేహపూర్వక ప్రభుత్వం.. గతంలో జరిగింది వదిలేద్దాం.. భవిష్యత్తు పనుల మీద దృష్టిపెడదాం’ జిల్లా తొలి సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఉద్యోగులను ఉద్దేశించి చేసిన సూచన...
ఇది జరిగిన పది రోజుల తరువాత మంత్రిగా హరీష్‌రావు తన శాఖ మూలాల్లోకి తొంగి చూస్తే...! అడ్డగోలుగా నిధులు మింగిన తీరును చూసి కంగుతిన్నారు. రూ. కోట్లాది నిధుల అవినీతి వరద పారినట్టు ‘ఫైళ్లు’తిరిగేయక ముందే అర్థమయిపోయింది. జిల్లాలో ఐదేళ్లుగా చెరువులు, కుంటల మరమ్మతు అభివృద్ధి పనులపై ప్రాథమిక సమాచారం సేకరించగా, పనులు చేయకుండానే.. చేసినట్లు రికార్డులు చూపించి రూ. వందల కోట్లు దారి మళ్లించినట్లు బయటపడింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు,నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్ల్లు నీటిపారుదలశాఖ ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో చెరువుల మరమ్మతు, అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై మంత్రి హరీష్‌రావు రహస్య విచారణకు ఆదేశించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. విచారణ విషయాన్ని ముందే పసిగట్టిన సంగారెడ్డి డివిజన్ నీటిపారుదల శాఖ ఈఈ బాల్‌రాజు గప్‌చుప్‌గా దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లినట్లు సమాచారం. ఈఈ దీర్ఘకాలిక సెలవును ఆశాఖ అధికారులు సైతం నిర్ధారించారు. అయితే ఆయన దీర్ఘకాలిక సెలవు ఎందుకు వెళ్లారనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలేదు. తన పై వేటు పడకుండా ఉండేందుకే ఆయన సెలవుపై వెళ్లినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున అవినీతి?
జిల్లాలో భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు ఏవీ లేవు. చెరువులు, కుంటలపైనే రైతులు ఆధారపడి సాగుచేయాల్సి వస్తోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా ఆయకట్టు కలిగిన చెరువులు 582, వందకు లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 6,207 ఉన్నాయి. గత ప్రభుత్వం జిల్లాలో చెరువులు, కుంటల మరమ్మతు, ఇతర పనుల కోసం ప్లాన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఆర్‌ఆర్‌ఆర్, స్పెషల్ ఫండ్స్ పేరిట కోట్లాది రూపాయలతో పనులు చేపట్టారు. పది నియోజకవర్గాలకు గాను సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు నియోజకవర్గాల్లో నిధులు దుర్వినియోగం పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌లు నీటిపారుదలశాఖ చేపట్టిన పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగాయని, తగిన చర్యలు చేపట్టాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావును కోరారు. దీంతో మంత్రి హరీష్‌రావు నిధులు దుర్వినియోగంపై ఆరా తీయగా చెరువులు, కుంటల పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆ శాఖ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
విచారణ లేకుండానే అంగీకారం!
పటాన్‌చెరు నియోజవర్గంలోని చెరువుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఇటీవల నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాజలింగంను నియమించారు. ప్రాథమికంగా సమాచారం సేకరించిన ఆయన చెరువు మరమ్మతు పనుల్లో భారీగా అవినీతి జరిగిందనే అంచనాకు వచ్చారు. పైగా ఎలాంటి విచారణ లేకుండానే అక్కడి స్థానిక ఏఈ అవినీతిని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
పాథమిక సమాచారం ఆధారంగా మంత్రి హరీష్‌రావు మూడు నియోజకవర్గాల్లో చెరువుల, కుంటల మరమ్మతు పనులపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మూడు నియోజకవర్గాల్లో పనులను ప్రతిపాదించి, పర్యవేక్షణ చేసే సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్ ఈఈ దీర్ఘకాలిక సెలవులో వెళ్లటం నిధులు దుర్వినియోగం జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా నీటిపారుదలశాఖ అధికారులు విచారణ విషయంపై గోప్యతను కనబరుస్తున్నారు. నిధులు దుర్వినియోగంపై విచారణకు సంబంధించి తమకు సమాచారంలేదని అధికారులు దాటవేస్తున్నారు.