నిధులు అటేనా! | funds for the development of backward regions | Sakshi
Sakshi News home page

నిధులు అటేనా!

Published Wed, Dec 24 2014 3:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

funds for the development of backward regions

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు (బీఆర్‌జీఎఫ్) ఇప్పట్లో మోక్షం లేనట్లే. వచ్చే మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సిన ఈ నిధులు ఇప్పటికీ విడుదల కాలే దు. వాస్తవంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రతి పాదనలు పంపితే, జూన్‌లో ఈ నిధులు వస్తాయి. ప్రతిపాదనలకు ముందుగా జిల్లా పరిషత్ సర్వస భ్య సమావేశం, తరువాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి.

2014-15 బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాల్లో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా, జిల్లాలో మాత్రం బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జడ్‌పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్ 22న అత్యవసర సమావేశంలో రూ.25.34 కోట్ల బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినా, మూడు నెలలైనా నిధుల ఊసు లేదు.

జూన్‌లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే
వెనుకబడిన ఫ్రాంతాల అభివృద్ధి నిధుల కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేకాధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలు, 36 మండలాలు అప్పట్లోనే రూ.25.34 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. జడ్‌పీ సర్వసభ్య సమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

ఆ తర్వాత వరుస గా ఎన్నికలు జరిగాయి.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, జడ్‌పీటీసీ సభ్యులు చేసిన ప్రతిపాదనలలో తేడా వచ్చింది. కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్‌జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం కోసం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు రూ.4 కోట్లు, 36 మండలాలకు రూ.21.34 కోట్ల పనులను రూపొందించారు.

గ్రామపంచాయతీలు 50 శాతం, మండల పరిషత్‌లు 30 శాతం, జిల్లా పరిషత్ నుంచి 20 శాతం పనులను ప్రతిపాదించారు. కానీ, వీటిని సెప్టెంబర్ మొదటి వారంలోగా ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జాప్యం జరిగింది. ఫలితంగా పొరుగు జిల్లా ఆదిలాబాద్‌కు రూ.25 కోట్లు విడుదల చేసిన కేంద్రం, జిల్లా ప్రతిపాదనలను మాత్రం ఇంకా కనికరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement