‘పంచాయతీరాజ్’కు నిధులు పెంచండి | funds raise to panchayat raj, asks KTR | Sakshi
Sakshi News home page

‘పంచాయతీరాజ్’కు నిధులు పెంచండి

Published Sun, Feb 15 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

funds raise to panchayat raj, asks KTR

- ఆర్థిక శాఖకు మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు


సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్  విభాగానికి భారీగా నిధులు కేటాయించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక  శాఖకు విన్నవించారు. ఈ మేరకు శనివారం పలు ప్రతిపాదనలను ఆర్ధిక మంత్రికి, ప్రణాళికా సంఘ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్  వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ రహదారుల విస్తరణ, కొత్త వాటి నిర్మాణం, మరమ్మతు పనులకు రూ.5,470 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మందికి ‘ఆసరా’ పింఛను ద్వారా భరోసా కల్పిస్తున్నామన్నారు. దీనికోసం రూ.4.9 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. బీడీ కార్మికులకు మార్చి 1 నుంచి  పింఛను వర్తింపజేయాలని నిర్ణయించినందున మరో రూ.400 కోట్లు కేటాయించాలన్నారు.
 
పల్లె ప్రగతికి 100 కోట్లు:

‘తెలంగాణ పల్లె ప్రగతి’ ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టనున్న కార్యక్రమాలకు ప్రభుత్వ వాటా కింద రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. పల్లెల్లో జీవనోపాధి పెంపు, వ్యవసాయంలో లాభ సాటి పద్ధతులు, గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గ్రామ సేవా కేంద్రాల గురించి ఆర్థికశాఖ, ప్రణాళికా సంఘం ప్రతినిధులకు మంత్రి వివరించారు. శ్రీ రామానంద తీర్థ శిక్షణ సంస్థ (నల్లగొండ) స్థాయిని పెంచేందుకు రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు. ‘సెర్ప్’కు ప్రస్తుతం ఇస్తున్న నిధులను రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. ‘ఉపాధిహామీ’ కింద గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, హరిత హారం తదితర శాశ్వత ఆస్తుల కల్పనకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.
 
వాటర్‌గ్రిడ్‌కు 6 వేల కోట్లు:

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున, రానున్న బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ ప్రతిపాదించారు. దీనికి నిధుల కొరత లేకుండా చూస్తామని ఆర్థిక మంత్రి ఈటెల ఆయనకు హామీ ఇచ్చారు. వేసవిలో తాగునీటి ప్రణాళికలకు రూ.150 కోట్లు కావాలని కేటీఆర్ కోరారు.

ఐటీ అభివృద్ధికి 250 కోట్లు:

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన  కార్యక్రమాలకు రూ.250 కోట్లు అవసరమని కేటీఆర్ ప్రతిపాదనలను సమర్పించారు. మౌలికవసతుల ఏర్పాటుకు రూ.150 కోట్లు, టాస్క్ కోసం రూ.9 కోట్లు, సాప్‌నెట్ కోసం రూ.4 కోట్లు, ఈ-సేవా కింద రూ.రెండు కోట్లు, ఈ- గవర్నెన్స్ కోసం రూ.30 కోట్లు కావాలని మంత్రి తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement