విలీనం తప్పదా...?! | future of Polavaram caved villages | Sakshi
Sakshi News home page

విలీనం తప్పదా...?!

Published Sun, Jun 15 2014 3:32 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

విలీనం తప్పదా...?! - Sakshi

విలీనం తప్పదా...?!

 భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి వేరుచేయడాన్ని నిరసిస్తూ రాజకీయపార్టీలు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి...స్థానిక ఆదివాసీలు ఆందోళనలు జరుపుతూనే ఉన్నారు...చివరికి అసెంబ్లీలో సైతం తీర్మానాలు చేశారు...ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటన చేశారు. ఇంత జరుగుతున్నా...  అసలు ప్రక్రియ మాత్రం ఎక్కడా ఆగడం లేదు.
 
జిల్లాలోని పోలవరం ముంపు పరిధిలో గల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన నివేదికలను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.  ప్రజా పంపిణీకి సంబంధించిన కొన్ని సరుకుల బదలాయింపు ఇప్పటికే జరిగింది. పెట్రోల్ బంక్‌లు, మద్యం దుకాణాలు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ కేంద్రంగా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు నెల నెలా పేదలకు ఇచ్చే రేషన్ సరుకులు కూడా జూలై మాసంలో ఆంధ్ర నుంచే వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం పేరుతో తమను ఆంధ్ర ప్రాంతానికి తరలించి వేస్తారనే ఆందోళన ముంపు మండలాల ప్రజల్లో రోజురోజుకు తీవ్రమవుతోంది.
 
వేరుకానున్న 1,90,304 మంది
కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్ మేరకు జిల్లా అధికార యంత్రాంగం తాజాగా రూపొందించిన లెక్కల ప్రకార ం భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కానున్నాయి. ఈ గ్రామాల పరిధిలో గల 1,90,304 మంది జనాభా జిల్లా నుంచి  వేరు కానున్నారు. ఇందులో భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో 277 రెవెన్యూ గ్రామాల్లోని 1,31,528 మందిని తూర్పు గోదావరి జిల్లాకు, అదే విధంగా పాల్వంచ రెవెన్యూ డి విజన్ పరిధిలో గల మండలాల్లో 47 రెవెన్యూ గ్రామాల్లోని 58,776 మందిని పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించనున్నారు.
 
అదే విధంగా భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాల పరిధిలో 1,99,825.60 హెక్టార్ విస్తీర్ణంలో ఉన్న భూభాగం, దీని పరిధిలో గల 1,51,024  హెక్టార్‌ల అటవీప్రాంతం తూర్పుగోదావరిలో కలువనుంది. పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో గల మూడు మండలాల్లో 276291.05 హెక్టార్‌ల భూభాగం, దీని పరిధిలో ఉన్న 202754.62 హెక్టార్‌ల అటవీ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఆర్డినెన్స్ ఆమోదం మేరకు ఈ ప్రాంతాన్ని ఏ క్షణానైనా అడిగే అవకాశం ఉన్నందున దీన్ని అప్పగించేందుకు జిల్లా అధికారులు నివేదికలను తయారు చేశారు.
 
 సరుకు రవాణా షురూ
జిల్లాలో ఉన్న ముంపు మండలాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కొన్ని రకాల సరుకులు వస్తున్నాయి. ఆర్డినెన్స్ ఆమోదం మేరకు భౌగోళికంగా ఈ ప్రాంతమంతా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లినట్లేనని భావించిన అధికారులు ముంపు మండలాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి సరుకుల సరఫరా నిలిపివేశారు. భద్రాచలం డివిజన్‌లో ఉన్న 7 మద్యం దుకాణాలకు రాజమండ్రి నుంచి, పాల్వంచ డివిజన్‌లో ఉన్న మూడు ముంపు మండలాలకు ఏలూరు నుంచి మద్యం సరఫరా అవుతోంది.
 
 ఇప్పటి వరకూ ఈ మద్యం దుకాణాలకు జిల్లాలో ఉన్న వైరా డిపో నుంచి మద్యం సరఫరా అయ్యేది. అయితే, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం ఖమ్మం జిల్లా నుంచే జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ ఉన్నతాధికారులను వివరణ కోరగా, ముంపు మండలాల్లోని మద్యం దుకాణాలను ఏపీ బ్రీవరేజెస్ కార్పొరేషన్‌కు బదలాయించారని, అయితే ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.
 
 అదే విధంగా చింతూరు మండలం చట్టి, భద్రాచలం మండలం నెల్లిపాకలో ఉన్న పెట్రోల్ బంకులకు విశాఖపట్నం డివిజన్‌గా నిర్ణయించి రాజమండ్రి నుంచి పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. కుక్కునూరులో ఉన్న పెట్రోల్ బంకుకు ఏలూరు నుంచి సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వీటికి రామగుండం నుంచి సరఫరా చేస్తుండగా, రాష్ట్రాల విభజన నేపథ్యంలో పెట్రోలియం శాఖ అధికారులు ఈ మార్పులు చేశారని పెట్రోల్ బంకు యజమానులు తెలిపారు. కూల్ డ్రింక్స్‌ను కూడా కొన్ని రోజులు ముంపు మండలాలకు సరఫరా చేసేందుకు భద్రాచలంలో ఉన్న హోల్‌సేల్ డీలర్‌లు నిరాకరించగా, ఒత్తిడితో ప్రస్తుతానికి సరఫరా చేస్తున్నారు. అయితే వీటిని రాజమండ్రి నుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారని దుకాణదారులు అంటున్నారు.
 
 రేషన్ పరిస్థితేంటి?
 ఇక, ముంపు మండలాల ప్రజలకు సంబంధించి రేషన్ సరఫరా వచ్చే నెల ఎక్కడి నుంచి అవుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతి నెలా పంపే రేషన్ కోటాలో పౌరసరఫరాల కార్పొరేషన్ కోత విధిస్తే తప్ప తాము యథావిధిగా రేషన్ సరఫరా చేస్తామని జిల్లాస్థాయి అధికారులు చెపుతున్నారు. అయితే, అలా కోత విధిస్తే ఇక పోలవరం ముంపు మండలాలపై పోరాడే అర్హత తెలంగాణ ప్రభుత్వానికి ఉండదని, అందుకే రేషన్ కోటాలో కోత ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుకోవడం కూడా అక్కడి ప్రభుత్వం బాధ్యత కనుక ఆ ప్రభుత్వం కూడా రేషన్ పంపుతుందని అంటున్నారు. అలా రెండు ప్రభుత్వాలు పంపితే ఏమిటన్నది చర్చనీయాంశమవుతోంది.
 
అభివద్ధి పనులన్నీ ఈ నెలాఖరునాటికే
ముంపు మండలాల్లో వివిధ పథకాల కింద జరుగుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. జూన్ 30 తరువాత ఏమైనా పనులు మిగిలి ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బిల్లులు చెల్లించటం కుదరని, మంజూరైన నిధులు కూడా తిరిగి తీసుకుంటామనే ఆదేశాలు ఉన్నట్లుగా ఓ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు.

దీంతో ముంపు మండలాల్లో చేపడుతున్న పనులను ఆగమేఘాల మీద పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు  ముంపు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదని ఆయా శాఖల డీడీవోలు చెబతుండటంతో తాము ఎటువైపు ఉన్నట్లని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముంపు ఉద్యోగులకు ఆప్షన్‌లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని వారు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement