
దుబ్బాక: తాను పాలక పక్షం కాదు.. ప్రతిపక్షం కాదు.. తానెప్పుడూ ప్రజల పక్షమేనని ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలోని లచ్చపేటలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బహుజన వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
దేశంలోని పేద కులాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదన్నారు. రాజ్యాంగంతోనే నిచ్చన మెట్ల కుల వ్యవస్థకు తూట్లు పడ్డాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు, అగ్రకులాల్లోని పేదలకు ఓటు హక్కు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవాన్ని అంబేడ్కర్ నింపారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా లచ్చపేట గ్రామంలోనే బహుజన వైతాళికుడు, ఆది హిందూ వ్యవస్థాపకుడు, తొలితరం దళిత నేత, దేశానికి దిక్సూచి భాగ్యరెడ్డి వర్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని, ఇప్పుడు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గద్దర్ అన్నారు.