గద్వాల క్రైం: సాక్ష్యాత్తు కలెక్టర్ పాఠశాల పనితీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చేరడం లేదని హెచ్‌ఎంను అడగగా.. పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారంటూ చెప్పడంతో పిల్లలు లేనప్పుడు ఇక్కడ మీరెందుకు.. ఈ పాఠశాలను ఎందుకు మూసివేయకూడదని జోగుళాంబ గద్వాల కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని వెంకంపేట ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 85 మంది మాత్రమే ఉండటంతో హెచ్‌ఎంను నిలదీశారు. ఇంత మంది ఉపాధ్యాయులు ఉండి నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్‌కు నాంది పలికి, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగించలేకపోవడం మీ నిర్లక్ష్యమేనన్నారు.
ఇక ఈ పాఠశాలను మూసి వేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా సరిగా ఉడకని అన్నం, నీళ్ల చారు ఉండడంతో వంట ఏజెన్సీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని హెచ్చరించారు. పాఠశాల నిర్వహణలో అలసత్వం వహించిన హెచ్‌ఎంకు మెమో జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ ఇదే తీరు ఉండడం, స్టాక్ రిజిష్టర్ నమోదు చేయకపోవడంతో కార్యకర్తకు మెమో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment