గద్వాల మార్కెట్‌కు మోక్షం
గద్వాల :
ఎట్టకేలకు గద్వాల పత్తి మార్కెట్‌కు మోక్షం లభించింది. ఆరేళ్ల క్రితమే ప్రారంభించినా.. తర్వాత అది మూలనపడింది. చివరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు గురువారం ఆదేశించడంతో సీసీఐ కొనుగోళ్లు జరపనుం ది. హైదరాబాద్‌లో మార్కెటింగ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తో జరిగిన సమీక్షా సమావేశంలో గద్వా ల పత్తి మార్కెట్‌పై మంత్రి స్పందిం చారు. దీంతో గద్వాల కాటన్ మార్కెట్ కు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది.
గద్వాల ప్రాంతంలో మూడు, నాలుగు దశాబ్ధాల క్రితం పత్తి విత్తనోత్పత్తి సాగు ప్రారంభమైంది. పత్తి విత్తనోత్పత్తిలో రైతులకు, ఆర్గనైజర్లకు అధిక ఆదాయం వస్తుండడంతో ఏటేటా విస్తీర్ణం పెంచా రు. దీనికితోడు దేశంలోనే గద్వాలలో ఉత్పత్తి అయిన పత్తి విత్తనాలకు మంచి మార్కెట్ ఉండడంతో కంపెనీలు కూడా పత్తి విస్తీర్ణాన్ని పెంచేందుకు ముందుకు వచ్చాయి. ఇలా ఎనిమిదేళ్ల క్రితం 30వేల ఎకరాల్లో పత్తి పంట సాగు ఉండడంతో గద్వాల మార్కెట్‌లో పత్తి మార్కెట్ కో సం రూ. 2కోట్ల వ్యయం చేశారు.
పత్తి మార్కెట్ నిర్మాణం పూర్తి కావడంతో 05 అక్టోబర్ 2008న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మార్కెట్ ప్రారంభోత్సవం చేయించారు. ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారం భం కాలేదు. ఆరేళ్ల పాటు ఉత్సవ విగ్రహంలా మార్కెట్ నిర్మాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం గద్వాల కాటన్ మా ర్కెట్‌లో కొనుగోళ్లను ప్రారంభించాల్సిం దిగా సీసీఐని ఆదేశించడంతో మూలనపడిన మార్కెట్ ప్రాంతం రైతులకు ఉపయోగపడేలా మారే అవకాశం ఏర్పడింది.
మూడేళ్ల క్రితం నుంచి గద్వాల పత్తి విత్తనోత్పత్తి సమస్యల్లో రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో కంపెనీలు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించాయి. ప్రస్తుతం కేవలం 10వేల ఎకరాల్లో సీడ్ విత్తనోత్పత్తి పంట సాగవుతుండగా, కమర్షియల్ పత్తి పంట సాగు 2వేల ఎకరాల్లో ఉంది. సాగు చేసుకున్న పత్తి రైతులకు గద్వాల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం పత్తి రైతులు తమ ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లులకు అప్పగించి ఎంతిస్తే అంత తీసుకునే పరిస్థితి ఉంది. గద్వాల మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభించే విషయమై గద్వాల మార్కెట్ సెక్రటరీ హిమాశైలిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందడంతో పాటు సీసీఐ నుంచి స్పందన రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే తదుపరి చర్యలను చేపడతామని ఆమె తెలిపారు.