గద్వాల.. ఆకాంక్షను గుర్తించాలి
గద్వాల : గద్వాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరించడం లేదని ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా సాధన కోసం ఉద్యమించకపోతే గ్రామాల్లో తిరగలేని పరిస్థితిని టీఆర్‌ఎస్ నాయకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గద్వాల జిల్లా కాంక్షిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే డీకే అరుణ సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులకు సంపాదన, స్వలాభం తప్ప ప్రజల ఆకాంక్ష పట్టడం లేదని విమర్శించారు.
వ్యక్తిగత సంపాదనపై చూపిస్తున్న శ్రద్ధ నడిగడ్డ ప్రగతిపై చూపడం లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, మనోభావాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా ఆకాంక్షను చాటి చెప్పడానికే దీక్షలను కొనసాగిస్తున్నామన్నారు. దీక్షలో ఆర్టీసీ ఈయూ గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు భాస్కర్, గౌస్, శేఖర్, కేకే రెడ్డి, రాములు, కిరణ్‌కుమార్, సత్యారెడ్డి, రామచంద్రుడులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.