
సాక్షి, హైదరాబాద్ : అర్ధచంద్రాకారం.. రేకులతో నిర్మించిన విశాల ప్రాంగణం.. చూడగానే ఆకట్టుకునే రూపం.. అదేనండి.. ఒకప్పుడు పట్నం బస్టాండ్‌గా వెలుగువెలిగిన గౌలిగూడలోని ఆర్టీసీ పాత బస్టాండ్.. నిజాం కాలంలో నిర్మితమై ఇప్పటికీ సేవలందిస్తున్న 8 దశాబ్దాల నాటి ఈ అపురూప కట్టడం మరికొద్ది రోజుల్లో అదృశ్యం కాబోతోంది. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా అఫ్జల్‌గంజ్–గౌలిగూడ రోడ్డు వెడల్పు చేయాల్సిన నేపథ్యంలో దీన్ని కూల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాటి జమానాకు గుర్తుగా చిరస్మరణీయంగా మార్చాలనుకున్న ఆర్టీసీ ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. రోడ్డుకు మరోవైపు మూసీ కాలువ ఉండటంతో రోడ్డు విస్తరణకు ఈ నిర్మాణం ఉన్నవైపే విస్తరించాల్సి వస్తోంది. 25 అడుగుల కంటే ఎక్కువ స్థలం సేకరించాల్సిన ఉండటంతో ఈ నిర్మాణం దాదాపుగా రూపుకోల్పోనుంది. రేకులతో నిర్మితమైన కట్టడం కావటంతో కొంత తొలగించినా మిగిలిన నిర్మాణాన్ని వాడుకునే వెసులుబాటు లేదు. దీంతో మొత్తం కట్టడాన్నే తొలగించాల్సి వస్తోంది.
80 ఏళ్ల క్రితం గిడ్డంగిగా..
గౌలిగూడ బస్టాండ్‌ను నిజాం హయాంలో నిర్మించారు. 80 ఏళ్ల క్రితం గిడ్డంగి అవసరాల కోసం దీన్ని నిర్మించినా వెంటనే నాటి నిజాం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. అప్పట్లో హైదరాబాద్‌కు ఇదే ప్రధాన బస్టాండ్. రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు బస్సులు నడిచేవి. అయితే.. క్రమేపీ బస్సుల సంఖ్య పెరిగి బస్టాండ్ ఇరుకవడంతో కొత్త బస్టాండ్ నిర్మాణం అనివార్యమైంది. దీంతో 1994లో మూసీ మధ్యలో ప్రస్తుత మహాత్మాగాంధీ బస్టాండ్ నిర్మించి అందులోకే సెంట్రల్ బస్‌స్టేషన్‌ను మార్చారు. దీంతో ఈ నిర్మాణం అనతికాలంలోనే వృథాగా మారింది. తర్వాత సిటీ బస్సుల బస్టాండ్‌గా మార్చి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు.
మ్యూజియంగా మార్చాలనుకున్నారు కానీ..
విశాలమైన ప్రాంగణం కావటంతో బస్టాండ్ స్థలాన్ని భవిష్యత్ అవసరాలకు వాడుకోడానికి ఆర్టీసీ అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. రేకుల బస్టాండ్‌ను కూల్చి భారీ నిర్మాణం చేపట్టాలని, సీఎన్‌జీ బస్సులకు కేటాయించాలని, వాణిజ్య సముదాయానికి ఇవ్వాలని అనేక రకాలుగా ఆలోచించింది. నిజాం హయాంలో నిర్మితమైన, హైదరాబాద్ తొలి బస్టాండ్ కావడంతో నాటి జ్ఞాపకంగా మ్యూజియం తరహాలో అభివృద్ధి చేయాలనీ యోచించింది. కానీ.. రోడ్డును వెడల్పు చేసేందుకు ప్రత్యామ్నాయం లేకపోవటంతో బస్టాండ్‌ను కూల్చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కూల్చకుండా చూస్తాం
రోడ్డును వెడల్పు చేసేందుకు ఆ పాత నిర్మాణాన్ని కూల్చేయాల్సి వస్తోందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. రోడ్డుకు మరోవైపు మూసీ నది ఉండటంతో ఇటువైపే వెడల్పు చేయాల్సిన పరిస్థితి. బస్టాండ్ పాత జ్ఞాపకం కావటంతో కూల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గం కుదిరితే కాపాడుకున్నట్టే. కానీ అది సాధ్యపడకపోవచ్చని చెబుతున్నారు. ఇంకా కొంత సమయం ఉన్నందున ప్రయత్నిస్తాం. – ఆర్టీసీ ఎండీ రమణారావు