అణువణువూ అనుసంధానం
⇔ ప్రగతి భవన్‌కు గ్రేటర్‌లోని సీసీ కెమెరాలన్నీ లింక్
⇔కీలక సమయాల్లో సీఎం స్వయంగా పర్యవేక్షించేందుకే
⇔హనుమాన్ జయంతి యాత్రతో మొదలైన లింకేజీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతి కీలక ప్రాంతాన్ని ఇకపై ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ నుంచి వీక్షించవచ్చు. నగర వ్యాప్తంగా ఏర్పాటైన ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలను అనుసంధానించడంతో ఇది సాధ్యమవుతోంది. హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో మంగళవారం ఈ లింకేజ్ పనిచేయడం ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయంతోనూ వీటిని లింక్ చేశారు. కీలక సమయాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేప్పుడు ముఖ్యమంత్రితో పాటు డీజీపీ సైతం పరిస్థితుల్ని పర్యవేక్షించడం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు అధికారులు చెప్పారు.
పది వేలకు పైగా కెమెరాల అనుసంధానం...
ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న సిటీ పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ నిఘా, ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు అపార్ట్‌మెంట్ వాసుల్నీ కలుపుకుంటూ వెళ్తున్న పోలీసులు వారితో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికే నగరంలో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లోనూ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయించారు. వీటి నుంచి సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను పర్యవేక్షించే అవకాశం కల్పించారు.
పారిశుధ్యం, మంచినీటి సరఫరా, లీకేజీలు తదితరాల పర్యవేక్షణకూ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీనికోసం ఆయా విభాగాలకూ భాగస్వామ్యం కల్పించారు. ఇకపై వీటన్నింటినీ అవసరమనుకున్నప్పుడు సీఎం ప్రగతిభవన్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. వివిధ ఉత్సవాల సందర్భంగా నగరంలో జరిగే భారీ ర్యాలీల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. నిత్యం వీటికి సంబంధించిన సమాచారం సీఎం, డీజీపీ తదితర కార్యాలయాలకు చేరుతుంటుంది.
హనుమాన్ ర్యాలీ పర్యవేక్షణ...
మంగళవారం జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సీసీసీ నుంచి, డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్‌లో సీఎం, ఇతర అధికారులు సైతం దీన్ని వీక్షించినట్లు తెలిసింది. దీనికోసం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా భారీ వీడియో వాల్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.