సాక్షి, హైదరాబాద్: సోమవారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. దీనికితోడు మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి నగర పరిధిలోని ఏసీపీలకు, సిబ్బందికి కీలక సూచనలు జారీచేశారు. వరుస వర్షాల నేపథ్యంలో నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, జీహెచ్ఎంసీ సూచనలు తప్పకుండా పాటించాలని నిర్దేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఏసీపీలకు కమిషనర్ ఈ కింది కీలక ఆదేశాలు జారీచేశారు.
- మీ పరిధిలోని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ముఖ్యంగా శిథిలమైన భవనాలు, దెబ్బతిన్న కట్టడాలపై సత్వరమే చర్య తీసుకోండి. ప్రమాదకర స్థితిలో ఉన్న శిథిలమైన భవనాలను ఖాళీచేయించడం, సీల్ చేయడం లేదా కూల్చివేయండి.
- శిథిలమైన పురాతన కాంపౌండ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్‌పై చర్య తీసుకోండి
- పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాలను తనిఖీ చేయండి. వాటి పరిసరాల్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయించండి
- సెల్లార్ (గ్రౌండ్ ఫ్లోర్) తవ్వకాలను అనుమతించకండి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ఏసీపీలందరూ సెల్లార్ సైట్‌ను తనిఖీ చేయాలి.
- ఇప్పటికే సెల్లార్‌ను తవ్వి ఉంటే.. నేలను గట్టిపరచడం, నేయిలింగ్ వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా యజమానులకు సూచించండి. సెల్లార్‌లను మరింతగా తవ్వకుండా నిలువరించండి.
- కొండప్రాంతాలైన బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ మొదలైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలను తప్పించేవిధంగా ప్రజలను అప్రమత్తం చేసి.. కొండ దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోండి.
- శిథిలమైన భవనాలకు నోటీసు బోర్డులు తగిలించండి. ప్రజలు వాటివద్దకు వెళ్లకుండా ఉండేలా బ్యారికేడ్లు పెట్టండి. పురాతన భవనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడండి.
- అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి.
- కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే అలర్ట్ మెసేజ్‌లు, ఐఎండీ, మీడియా నుంచి అందే వాతావరణ రిపోర్ట్స్ పట్ల అలర్ట్‌గా స్పందించండి.
Comments
Please login to add a commentAdd a comment