లింక్‌ రోడ్లపై నజర్‌ | GHMC Focus on Link Roads Repair in This Lockdown | Sakshi
Sakshi News home page

లింక్‌ రోడ్లపై నజర్‌

Published Wed, May 6 2020 9:47 AM | Last Updated on Wed, May 6 2020 9:47 AM

GHMC Focus on Link Roads Repair in This Lockdown - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ తరుణంలో వివిధ నిర్మాణ పనులను వేగంగా చేస్తోన్న జీహెచ్‌ఎంసీ స్లిప్, లింక్‌రోడ్లపైనా దృష్టి సారించింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్‌ఎంపీ పనుల్ని త్వరితంగా చేస్తుండగా.. స్లిప్, లింక్‌ రోడ్లకు సంబంధించి అవసరమైన భూసేకరణల్ని పూర్తిచేస్తే వాటిని కూడా లాక్‌డౌన్‌ను వినియోగించుకోవడంతోపాటు వర్షాకాలం వచ్చేలోపునే పూర్తిచేయాలని భావిస్తోంది. మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ వీటిని త్వరితంగా చేయాలని ఆదేశించడంతో అధికారులు వీటిపై దృష్టి సారించారు.

ఆస్తుల సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే పనులు జరుగుతుండగా, ఆస్తుల సేకరణ జరగాల్సిన ప్రాంతాల్లో త్వరితంగా ఆ పని చేసేందుకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో  స్థానిక ఎమ్మెల్యేలు గాంధీ, కృష్ణారావు, సీసీపీ దేవేందర్‌రెడ్డి, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ సీఈ, వసంత  తదితర అధికారులతో కలిసి  క్షేత్రస్తాయిలో పర్యటించారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా చేసేందుకు అవసరమైన  ఆస్తుల సేకరణకు  సహకరించాల్సిందిగా యజమానులను కోరారు. అందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం  ఆయా ప్రాంతాల్లోని  స్లిప్, లింక్‌రోడ్ల మార్గాలను మేయర్‌ పరిశీలించారు. అవి..

న్యూ అల్లాపూర్‌–సున్నం చెరువుకు వెళ్లే 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 420 మీటర్ల పొడవు లింక్‌ రోడ్డు
జి.వి.హిల్స్‌ పార్కు నుండి వయా ప్రభుపాద లేఅవుట్‌ ద్వారా మజీద్‌ బండ రోడ్డును అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న వెయ్యి మీటర్ల లింక్‌ రోడ్డు
నిజాంపేట క్రాస్‌ రోడ్‌ నుండి వయా వసంతనగర్, న్యాక్‌ ద్వారా హైటెక్స్‌ జంక్షన్‌ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 2,200 మీటర్ల పొడవున నిర్మిస్తున్న లింక్‌ రోడ్డు
హెచ్‌.టి.లైన్‌ నుండి మియాపూర్‌ రోడ్డు వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న లింక్‌ రోడ్డు
కొండాపూర్, బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డు నుండి హఫీజ్‌ రైల్వే ట్రాక్‌ వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 230 మీటర్ల లింక్‌ రోడ్డు
గోకుల్‌నగర్‌ అక్షయ ఫుడ్‌ కోర్టు నుండి వయా ఐ.డి.పి.ఎల్‌ ద్వారా ఎన్‌హెచ్‌–9 వరకు అనుసంధానం చేసేందుకు చేపట్టిన 200 మీటర్ల లింక్‌  రోడ్డు
మియాపూర్‌ మెట్రో డిపో నుండి వయా ఐ.డి.పి.ఎల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ ద్వారా కొండాపూర్‌ మజీద్‌  వరకు అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న 1800 మీటర్ల లింక్‌ రోడ్డు

కొన్ని ప్రాంతాల్లో పనులు..
ఇప్పటికే భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు త్వరితంగా పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. అలాంటి వాటిల్లో దాదాపు రూ. 12 కోట్లతో  బోరబండ నుంచి అయ్యప్పసొసైటీ మార్గంలో 840 మీటర్ల రోడ్డు, తదితరమైనవి ఉన్నాయి. 

తొలిదశలో 55 మార్గాలు..
గ్రేటర్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో మొత్తం 248 కి.మీ.ల మేర 132 స్లిప్, లింక్‌రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. వీటిల్లో  55 మార్గాల్లోని 126 కి.మీ.ల పనులకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలని భావించారు. ఇందులో తొలిదశలోభాగంగా 78 కి.మీ.ల పనులు త్వరితంగా చేయాలని నిర్ణయించారు. స్లిప్,లింక్‌రోడ్ల పనులు హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోచేస్తుండగా, అవసరమైన భూసేకరణ జీహెచ్‌ఎంసీ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement