తొలిసారి బ్యాంకు గుమ్మం తొక్కనున్న జీహెచ్‌ఎంసీ | GHMC Hunting For Fund Loans | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ అప్పు డప్పు

Published Fri, May 10 2019 7:59 AM | Last Updated on Mon, May 13 2019 1:11 PM

GHMC Hunting For Fund Loans - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) రుణాల కోసం తొలిసారి బ్యాంకు మెట్లు ఎక్కనుంది. ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి తదితర పనుల కోసం ఈ ఏడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. దాదాపు రూ. 25 వేల కోట్ల ఎస్సార్‌డీపీ ప్రణాళికలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల కోసం గత ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.వెయ్యి కోట్లు వ్యయమైంది. ఇందులో గతేడాది మున్సిపల్‌ బాండ్ల జారీ ద్వారా రెండు విడతల్లో రూ.395 కోట్లు సేకరించారు. అవి మార్చితో ఖర్చయిపోయాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో జీహెచ్‌ఎంసీ జనరల్‌ ఫండ్స్‌ నుంచి మరో రూ.50 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఈ పనులకు వ్యయం చేశారు. వివిధ ప్రాజెక్టులు విభిన్న స్థాయిల్లో పురోగతిలో ఉండటంతో ఈసారి మరింత ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆయా పనులకు అవసరమైన భూసేకరణ,యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌ తదితర పూర్తి చేయగలిగితే ఈ ఏడాది రూ.1,500 కోట్ల వరకు పనులు జరిగే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. 

ప్రభుత్వ అనుమతి...  
జీహెచ్‌ఎంసీకి అభివృద్ధి పనులకు అవసరమైన రూ.3,500 కోట్లు సమీకరించుకునేందుకు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల క్రితమే అనుమతించింది. ఇందులో రూ.1000 కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ.2,500 కోట్లు రూపీ టర్మ్‌ లోన్‌ (ఆర్‌టీఎల్‌) ద్వారా సేకరించేందుకు అవకాశమిచ్చింది. ఈ నిధులను జీహెచ్‌ఎంసీనే తిరిగి చెల్లించే షరతుతో అనుమతి లభించింది. ఎస్సార్‌డీపీతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇతర ప్రాజెక్టులకు సేకరించే నిధులు ఖర్చు చేయాలని భావించారు. అనంతరం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తామని చెప్పడంతో వాటికి జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్సార్‌డీపీ పనుల కోసం ఇప్పటి వరకు రూ.395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బాండ్ల ద్వారా మరో రూ.200 కోట్లు సేకరించాలని భావిస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా   ఎన్నికల ప్రక్రియ ఉండడం, బాండ్ల ద్వారా నిధులు సేకరించిన కొన్ని సంస్థలు చెల్లింపులో డిఫాల్ట్‌ కావడంతో పాటు త్వరలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బాండ్ల మార్కెట్‌ స్థిరంగా లేదనే అభిప్రాయాలున్నాయి.

మున్సిపల్‌ బాండ్ల ద్వారా గతంలో మాదిరిగా తక్కువ వడ్డీకి సొమ్ము లభించడంపై కూడా సంశయాలున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం బాండ్లు, బ్యాంకు లోన్లకు అనుమతించినప్పటికీ ఇప్పటి వరకు బ్యాంకు ద్వారా రుణం పొందలేదు. ప్రస్తుతం బాండ్లకు అనువైన పరిస్థితులు కనిపించడకపోవడంతో పాటు బ్యాంకు రుణాలపై వడ్డీ కూడా దాదాపు 9.5 శాతంగా ఉండడం తదితర పరిగణనలోకి తీసుకొని ఈసారి బ్యాంకు రుణం తీసుకోవాలని భావిస్తున్నారు. బాండ్ల ద్వారా తీసుకున్నప్పటికీ, బ్యాంకుల ద్వారా కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. బాండ్ల ద్వారా ఇప్పటి వరకు రూ.200 కోట్లు 8.9 శాతం వడ్డీకి, రూ.195 కోట్లు 9.38 శాతం వడ్డీకి తీసుకున్నారు. ఎస్సార్‌డీపీ పనులకు ఇప్పటి వరకు బిల్లుల చెల్లింపు పెండింగ్‌లో లేకపోయినప్పటికీ, ఇక నుంచి చెల్లింపులకు నిధులు లేకపోవడంతో బాండ్ల ద్వారా గానీ, బ్యాంకు ద్వారా గానీ, రెండింటి ద్వారా గానీ అవసరాన్ని బట్టి నిధులు సేకరించనున్నారు. ఈ సంవత్సరం భారీ మొత్తంలో ఖర్చు కానుండడంతో అందుకనుగుణంగా నిధులు సేకరించనున్నారు. జూన్‌ నుంచి నిధుల సేకరణకు సంబంధించిన పనులు ముందుకు సాగనున్నాయి.  

ఏయే పనులకు...   
సిగ్నల్‌ ఫ్రీ పనుల కోసం ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. వీటిల్లో చింతల్‌కుంట, మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్, ఎల్‌బీనగర్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్‌ ఫ్లైఓవర్‌ తదితర ఉన్నాయి. పురోగతిలో ఉన్న వాటిల్లో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్, ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, కొత్తగూడ, కొండాపూర్‌ ఫ్లైఓవర్లు, షేక్‌పేట ఎలివేటెడ్‌ కారిడార్‌ తదితర ఉన్నాయి. వీటితో పాటు ఇతర పనులు ఆయా దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు, టెండర్ల దశలో ఉన్న మరికొన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement