సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణం తదితర పనులకు అవసరమైన నిధుల కోసం బల్దియా బ్యాంకు మెట్లు ఎక్కనుంది. రూపీ టర్మ్ లోన్ (ఆర్‌టీఎల్) ద్వారా రూ.2,500 కోట్లు తీసుకోనుంది. ఇందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. వీటి సేకరణకు అరేంజర్‌గా ఎస్‌బీఐ క్యాపిటల్‌ను నియమించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంగళవారం జీఓ జారీ చేసింది. బల్దియా ఎస్సార్‌డీపీ పనుల్లో పురోగతి మేరకు దశలవారీగా రుణం తీసుకోనుంది. తొలి దశలో 2020 మార్చి వరకు చేపట్టనున్న పనుల కోసం దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు సేకరించనుంది. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ప్రాజెక్టుల కోసం బ్యాంక్ లోన్ తీసుకోవడం ఇదే ప్రథమం.
అందుకే రుణం...
నగరంలో ఎస్సార్‌డీపీ కింద దాదాపు రూ.25వేల కోట్ల పనులకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. ఇప్పటి వరకు దాదాపు రూ.600 కోట్ల పనులు పూర్తవ్వగా... రూ.3వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రూ.2వేల కోట్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆయా ప్రాజెక్టుల పనులు, వాటికి అవసరమైన భూసేకరణకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంది. ఎస్సార్‌డీపీ పనుల కోసం రూ.1,000 కోట్లు బాండ్ల జారీ ద్వారా, రూ.2,500 కోట్లు బ్యాంక్ రుణాల ద్వారా... మొత్తం రూ.3,500 కోట్లు తీసుకునేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఇదివరకే అనుమతినిచ్చింది. బల్దియా మూడు విడతల్లో బాండ్ల జారీ చేసి రూ.495 కోట్లు సేకరించింది. కొంతకాలంగా బాండ్ల మార్కెట్ పరిస్థితి బాగాలేకపోవడం, అదే వడ్డీరేటుకు బ్యాంకులు కూడా రుణాలిచ్చే పరిస్థితి ఉండడంతో జీహెచ్‌ఎంసీ బ్యాంక్ లోన్ తీసుకునేందుకు సిద్ధమైంది.
ఇందుకు అవసరమైన ప్రక్రియను జీహెచ్‌ఎంసీనే పూర్తి చేయాలని భావించినప్పటికీ... అందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం, తగినంత మంది సిబ్బంది తదితర లేకపోవడంతో రుణ సమీకరణకు అరేంజర్‌గా ఎస్‌బీఐ క్యాపిటల్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకుగాను రుణంలో 0.10 శాతం ఫీజుగా చెల్లించనుంది. తక్కువ వడ్డీకి రుణమిచ్చే బ్యాంకుల నుంచి అప్పు తీసుకోనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఎస్‌బీఐ క్యాపిటల్ చూసుకుంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఒకేసారి రుణం మొత్తం తీసుకుంటే వడ్డీ పెరుగుతుందని, పనుల పురోగతిని బట్టి దశలవారీగా తీసుకుంటామని పేర్కొన్నారు. తొలి దశలో వచ్చే మార్చి నాటికి అవసరమయ్యే నిధులు సేకరిస్తామన్నారు.
చెల్లించాల్సింది జీహెచ్‌ఎంసీనే...
ఎస్సార్‌డీపీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొన్ని మార్గాల్లో భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. భూసేకరణకు వ్యయం ఎక్కువ అవుతోంది. బాండ్ల ద్వారా తీసుకున్న నిధులు ఖర్చయిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల చెల్లింపులకు నిధుల్లేవు. మరికొన్ని ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బల్దియా రుణానికి సిద్ధమైంది.
ఈ నిధుల్ని జీహెచ్‌ఎంసీనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ అప్పు తీసుకోకుండానే ప్రభుత్వం తగిన ఆర్థిక సహకారం అందించగలదని భావించినప్పటికీ, ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు నిలిచిపోకుండా బ్యాంకు రుణం తీసుకోనుంది. ఎస్పార్‌డీపీలో భాగంగా ఎల్‌బీనగర్, బయోడైవర్సిటీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, షేక్‌పేట, కొండాపూర్, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment