సాక్షి,సిటీబ్యూరో : చారిత్రక మూసీనదిని గరళ సాగరంగా మారుస్తోన్న ప్రధాన నాలాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలుమూలలా మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం తలపెట్టింది. ముందుగా మూసీకి ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూకట్‌పల్లి నాలాపై 400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేసేందుకు బ్యాంకాక్ (థాయ్‌లాండ్ దేశం) తరహాలో పది అంతస్తుల మురుగుశుద్ధి కేంద్రం నిర్మించాలని అదికారులు భావిస్తున్నారు. ముందుగా ఆ దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న మురుగు శుద్ధికేంద్రం పనితీరును అధ్యయనం చేసేందుకు త్వరలో జలమండలి నిపుణులు, అధికారుల బృందం బ్యాంకాక్‌లో పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధానంగా కూకట్‌పల్లి నాలాలో బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయనిక వ్యర్థాలతో పాటు సమీప గృహ, వాణిజ్య సముదాయాల నుంచి మురుగునీరు చేరుతోంది. ఈ వ్యర్థజలాలు క్రమంగా మూసీలో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద నాలాను శుద్ధి చేసేందుకు సాధారణ ఎస్టీపీ సరిపోదు. రసాయనిక వ్యర్థాలు, ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ తప్పనిసరి. అయితే ఈ రెండింటిని సమ్మిళితం చేసి బ్యాంకాక్ నగరంలోని ఎస్టీపీలో అవలంభించిన మూవింగ్ బెడ్ బయో రియాక్టర్ (ఎంబీబీఆర్) సాంకేతిక విధానాలను ఇక్కడ అమలుచేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల జలమండలి అధికారులను ఆదేశించారు.
మురుగుశుద్ధితో మూసీకి మహర్దశ
గ్రేటర్ వ్యాప్తంగా వివిధ రకాలుగా నిత్యం 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలో 700 మిలియన్ లీటర్ల మురుగును జలమండలి అంబర్‌పేట్, అత్తాపూర్, నాగోల్, నల్లచెరువు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా 700 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు నేరుగా మూసీలో కలుస్తున్నాయి. దీంతో మూసీ నది గరళ సాగరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తొలుత మూసీనదిలో కలిసే ప్రధాన నాలాలపై సుమారు 15 మురుగుశుద్ధి కేంద్రాలను నిర్మించి, ఎక్కడికక్కడ వ్యర్థ జలాలను శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కృషిలో కూకట్‌పల్లి నాలాపై ఎస్టీపీ నిర్మాణాన్ని తొలివిడతగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు 100 నివాసాలు దాటిన అపార్ట్‌మెంట్లలో విధిగా ఎస్టీపీ ఉండేలా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శుద్ధి చేసిన నీతిని గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్ వాషింగ్, టాయిలెట్ ఫ్లష్ వంటి అవసరాలకు శుద్ధిచేసిన జలాలను వినియోగించే అవకాశం ఉంది. దీంతో భూగర్భ జలాలు, జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిపై అంతగా ఒత్తిడి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
రూ.3100 కోట్లతో మాస్టర్ ప్లాన్
గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మురుగు కష్టాలను తీర్చేందుకు సుమారు రూ.3100 కోట్ల వ్యయంతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యతను ఇటీవల షా కన్సల్టెంట్స్ సంస్థకు అప్పగించింది. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి రోజువారీగా వెలువడుతున్న మురుగు జలాలు, ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలపై అధ్యయనం చేసి ఈ సంస్థ సమగ్ర నివేదికను ఆరునెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. తరవాత సీవరేజీ మాస్టర్‌ప్లాన్ దిశగా అడుగులు పడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment