సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలు..త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు.. జీహెచ్ ఎంసీపై పెను ప్రభావం చూపుతున్నాయి. అన్ని ఎన్నికల విధులకు జీహెచ్‌ఎంసీ సిబ్బందినే వినియోగించుకుంటుండంతో ప్రజలకు అందాల్సిన వివిధ సేవలు నిలిచిపోతున్నాయి. నగర పౌరుల కందే వివిధ సేవల్లో మెజార్టీ సేవలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జనన, మరణ ధ్రువీకరణపత్రాలు, ఆస్తిపన్ను వసూలు, ట్రేడ్‌లైసెన్సులు, ప్రకటనల పన్నులు, భవననిర్మాణ అనుమతులు, మ్యుటేషన్లు వంటి వాటికి సంబంధించి వ్యక్తిగతంగా, సంస్థాగతంగా సేవలందుతున్నాయి.రహదారుల మరమ్మతు, పారిశుధ్యం, వీధిదీపాలు, పార్కులు, ఆటస్థలాలు, వరదకాలువల నిర్వహణ తదితర పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టాల్సిందే. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సహా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో ఏ విభాగంలోనూ ఒక్క పని కూడా జరగడం లేదు. దీంతో ఆయా సేవల కోసం వస్తున్న ప్రజలు సంబంధిత అధికారులు, సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జనవరి నెలలో దొరికిన కాసింత విరామం పెండింగ్ ఫైళ్లను సర్దుకోవడంతోనే సరిపోయింది. ఎన్నికల్లో విరామమెరుగక పనిచేయడంతో కొందరు దీర్ఘకాల సెలవులు తీసుకున్నారు. పనులు చేసేందుకు పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలోనే తిరిగి మళ్లీ ఎన్నికల కోడ్ కూయడంతో పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు ఇదే పరిస్థితి ఉంటుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారుతోంది. రహదారులపై గుంతలు, పొంగిపొర్లే డ్రైనేజీలు సరేసరి. విద్యుద్దీపాలు వెలగకపోవడంపై ప్రజలు నేరుగా ఉన్నతాధికారులకే ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఆస్తిపన్నులో పొరపాట్లు సవరణలు, ఆస్తిబదలాయింపు(మ్యుటేషన్)కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.
దీంతో అత్యవసరమైన వారు అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి. టౌన్‌ప్లానింగ్‌లో ఆన్‌లైన్ ద్వారానే అనుమతులు కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఆన్‌లైన్ అయినా ఏదో కొర్రీ వేస్తూ అడిగినంత ఇవ్వనిదే అనుమతులు జారీ చేయడం లేరు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులదీ అదే పరిస్థితి. అన్ని పత్రాలు సమర్పించి, మొత్తం ఫీజులు చెల్లించినా ప్రొసీడింగ్స్ జారీ చేయకుండా నెలల తరబడి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అదేమంటే... ఎన్నికల విధులని పేర్కొంటున్నారు. బర్త్ సర్టిఫికెట్ల వంటివి అధికారులు జారీ చేసినా సిటిజెన్ సర్వీస్ సెంటర్లలో సర్వర్ల మొరాయింపు పేరిట ఇతరత్రా కారణాలతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేరు. ఇలా ఏ విభాగంలో చూసినా సేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎన్నికల కోడ్ అంటే.. అసలు అందుబాటులోనే ఉండరు. దీంతో లోక్‌సభ ఎన్నికలు ముగిసే మరో మూడు నాలుగు నెలలదాకా నగర ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.
ప్రాజెక్టుల పనులకు బ్రేక్..
సేవల పరిస్థితి అలా ఉండగా, నగరంలో ప్రారంభం కావాల్సిన ఎన్నో ప్రాజెక్టులకు బ్రేక్ పడింది. ఎస్సార్‌డీపీలో భాగంగా దాదాపు రూ. 24,000 కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించి వివిధ దశల్లో పనులు చేపట్టారు. వాటిల్లో దాదాపు రూ. 300 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. టెండర్లు పూర్తికావాల్సిన పనులు, టెండర్లు పిలవాల్సినవి దాదాపు రూ. 3500 కోట్లు, పరిపాలన పర అనుమతులు పొందాల్సినవి మరో రూ. 1500 కోట్ల మేర ఉన్నాయి. వెరసి దాదాపు రూ. 5000 కోట్ల పనులకు కోడ్ ఆటంకంగా మారింది.
నిధుల లేమి..
జీహెచ్‌ఎంసీ ఖజానా పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఆస్తిపన్ను వసూళ్లు ముమ్మరం చేయాల్సిన ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటే లక్ష్యానికనుగుణంగా ఆస్తిపన్ను వసూలు కష్టమే. ఈ సంవత్సరం లక్ష్యం రూ. 1500 కోట్లు కాగా, ఇంకా రూ. 500 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. సకాలంలో నిధులందక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. లక్ష ఇళ్ల నిర్మాణానికి రూ. 8598 కోట్లు ఖర్చు కానుండగా, ఇప్పటి వరకు దాదాపు రూ.3వేల కోట్ల మేర పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు పూర్తయితే చాలు.. కొత్త పనుల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం ఉన్నతాధికారుల వద్ద ఆయా సందర్భాల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఎస్సార్‌డీపీ పనులకే ఇప్పటికే రూ. రెండు విడతల్లో 395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించారు. మరో దఫా తీసుకోవాల్సిన అవసరమున్నప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాకే వెళ్లాలనే యోచనలో అధికారులున్నట్లు సమాచారం.
చేయాల్సిన పనుల్లో కొన్ని..వాటికయ్యే ఖర్చు..
♦ శిల్పా లేఔట్– గచ్చిబౌలి ఫ్లై ఓవర్ : రూ. 330 కోట్లు
♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్: రూ. 175 కోట్లు
♦ ఆరాంఘర్–జూపార్క్ ఫ్లై ఓవర్: రూ. 326 కోట్లు
♦ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ : రూ. 30 కోట్లు
♦ ఇందిరాపార్కు– వీఎస్టీ స్టీల్‌బ్రిడ్జి : రూ. 426 కోట్లు
♦ నల్లగొండ క్రాస్‌రోడ్ –ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్: రూ. 526 కోట్లు
♦ కైత్లాపూర్ వద్ద ఆర్‌ఓబీ : రూ. 83 కోట్లు
♦ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కొనసాగింపు, గ్రేడ్‌సెపరేటర్లు: రూ. 300 కోట్లు
జీహెచ్‌ఎంసీకే ఎన్నికల విధులు..
వాస్తవానికి ఎన్నికల విధులు అన్ని జిల్లాల్లో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తారు. నగరంలో మాత్రమే జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. ఎసెన్షియల్ సర్వీసెస్ కింద విద్యుత్, వాటర్‌బోర్డు అధికారులు, సిబ్బందికి కూడా ఎన్నికల విధుల్లేవు. కానీ, పారిశుధ్యంతో సహా ఎన్నో అత్యవసర సేవలు అందించే జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిని మాత్రం ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. ప్రజల సేవల్లో, నగర పరిస్థితిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే జీహెచ్‌ఎంసీకి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment