ఇక అక్రమాల లెక్క! | GHMC Survey on Footpath Construction in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇక అక్రమాల లెక్క!

Published Sat, Jun 1 2019 8:20 AM | Last Updated on Tue, Jun 4 2019 10:40 AM

GHMC Survey on Footpath Construction in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై టౌన్‌ప్లానింగ్‌ విభాగం సర్వే చేపట్టింది. ఎన్ని అక్రమ భవన నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు ఉన్నాయో లెక్కించి... ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఓ ప్రహసనంగా మారాయన్న సంగతి తెలిసిందే. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో లేక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడో హడావుడి చేసే అధికారులు... ఆ తర్వాత వాటి విషయం మరిచిపోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా   ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగం ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై దృష్టిసారించి వాటిని తొలగిస్తోంది. కానీ దాదాపు ఆరు నెలలుగా ఎన్నికల కోడ్‌తో ఇది నిలిచిపోయింది. కోడ్‌ ముగియగానే జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించిన మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ అక్రమ నిర్మాణాల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట ప్రధాన రహదారిపై శాశ్వత నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ సంబంధిత ఏసీపీని సస్పెండ్‌ చేశారు. అవసరమైతే ఇంజినీరింగ్‌ విభాగానికి టౌన్‌ప్లానింగ్‌ బాధ్యతలు అప్పగించి అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి? ఫుట్‌పాత్‌ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరిగాయి? అనే అంశాలపై సర్వే చేయాల్సిందిగా సంబంధిత సర్కిళ్లలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పని ప్రారంభించిన అధికారులు సర్వే పూర్తి చేసి వచ్చే వారంలో చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అవసరమైన పక్షంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగం సహకారం తీసుకోనున్నారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్‌ విభాగానిదేనని అర్వింద్‌కుమార్‌ పేర్కొనడంతో తొలుత సర్వే చేపట్టారు. 

అటకెక్కిన ‘అమలు’..  
అక్రమ నిర్మాణాలపై గత నవంబర్‌లోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను హెచ్చరించారు. అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోకపోవడంపై సమీక్ష సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. ఒక అధికారిని సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినప్పటికీ మెమోతో సరిపెట్టారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో? ఎన్ని నోటీసులు జారీ చేశారో? కోర్టు కేసులెన్ని ఉన్నాయో? నివేదిక రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ రోజూ వారీగా నమోదు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని కూడా సూచించారు. అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు? తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు? అనే విషయాలు ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తాయని భావించారు. మరోవైపు అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులు దాదాపు ఏడాదిన్నర క్రితమే నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చి వేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్‌ తదితర విభాగాలతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. కానీ ఇవేవీ అమల్లోకి రాలేదు.  

శిథిల భవనాలపైనా సర్వే..  
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిథిల భవనాల సర్వే కూడా పూర్తి చేసి తొలగించాల్సిన లేదా మరమ్మతులు చేయాల్సిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని, ఈ ప్రక్రియను జూన్‌ 10లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం గతేడాది వరకు దాదాపు 2,010 పురాతన, శిథిల భవనాలు ఉండగా వాటిల్లో  దాదాపు 1,400 భవనాలను కూల్చివేశారు. మరో 600 కూల్చివేయాల్సి ఉంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు మరికొన్ని శిథిలావస్థకు చేరి ఉంటాయి. ప్రతిఏటా దాదాపు వెయ్యి వరకు శిథిల భవనాలుంటున్నాయి. పాతబస్తీతో పాటు కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. నిర్ణీత వ్యవధుల్లో శిథిల భవనాల్లోని వారికి నోటీసులైతే జారీ చేస్తున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోవడం లేరు. ఈసారైనా ఈ తీరు మారుతుందేమో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement