బాల్యవివాహం పేరిట అధికారులు తన పెళ్లిని అడ్డుకున్నారని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
వెల్దుర్తి (మెదక్): బాల్యవివాహం పేరిట అధికారులు తన పెళ్లిని అడ్డుకున్నారని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ వాడకు చెందిన ఉప్పల కిష్టవ్వ, నర్సింహులు దంపతుల రెండో కూతురు అనిత(17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గత డిసెంబర్ 22న.. 30 సంవత్సరాల యువకునితో పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక సమాజంలో తిరగలేక, కళాశాలకు వెళ్లలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకుంది. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ‘నా పెళ్లిని అడ్డుకోవడంతో తలెత్తుకొని తిరగలేక ఇలా ఆత్మహత్య యత్నం చేశానని’ మెజిస్ట్రేట్‌కు అనిత వాంగ్మూలం ఇచ్చిందని ఏఎస్సై తెలిపారు.