ప్రియుడే భార్యతో కలిసి చంపేశాడు..
పరిగి: వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రియురాలిని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించాడు. కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేసి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్‌లో ఈ నెల 16న వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు పంపారు. పరిగిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. దోమ మండలం ఐనాపూర్‌కు చెందిన గార్లపల్లి లక్ష్మి(30), వెంకటయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
లక్ష్మి ఈ నెల 16న ఉదయం గ్రామ శివారులోని పొలాలో హత్యకు గురై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, గ్లాస్‌లు పడిఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మికి మద్యం తాగించి అత్యాచారం చేసి ఉండొచ్చని మొదట భావించారు. ఆమె ఒంటిపై అభరణాలు కనిపించకపోవడంతో దుండగులు ఆమెను చంపేసి నగలు అపహరించారనే కోణంలో కూడా అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం..
లక్ష్మి వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. ఆమెకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయ్యే గార్ల భీమయ్య(32)తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి అతడిని కలుస్తుండేది. ఈ విషయం తెలుసుకున్న భీమయ్య భార్య అమృతమ్మ భర్తతో గొడవ పడింది. భీమయ్య తన ‘సంబంధం’ మానుకోకపోవడంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. తీరు మార్చుకోకపోతే తాను చచ్చిపోతానని అమృతమ్మ భర్తను హెచ్చరించింది. భార్యకు సర్దిచెప్పిన భీమయ్య.. ఎలాగైనా లక్ష్మిని చంపేద్దామని హామీ ఇచ్చాడు.
దంపతులిద్దరు సమయం కోసం వేచిచూడసాగారు. ఈక్రమంలో ఈనెల 15న తెల్లవారుజామున లక్ష్మి ఎప్పటిమాదిరిగా బహిర్భూమికి వెళ్తున్నట్లు భర్త వెంకటయ్యకు చెప్పి ఇంట్లోంచి నేరుగా భీమయ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భీమయ్య పొలానికి వెళ్లాడు. ఆయన భార్య అమృతమ్మ ‘మా ఇంటికి ఎందుకు వచ్చావ’ని లక్ష్మితో గొడవపడింది. వెంటనే తమ ‘ప్లాన్’ గుర్తుకొచ్చి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. లక్ష్మిని ఇంట్లోనే ఉంచాలని భార్యకు చెప్పిన భీమయ్య వెంటనే ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మిని మధ్యాహ్నం వరకు తమ ఇంట్లోనే ఉంచి కల్లు తాగించారు.
ఆమెను ఇంట్లోనే ఉంచి భార్యభర్తలు పొలానికి వెళ్లి వచ్చారు. సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేశాక లక్ష్మికి మరింత మద్యం తాగించారు. ఆమె నిద్రలోకి జారుకుంది. రాత్రి పొద్దుపోయాక అమృతమ్మ లక్ష్మి కాళ్లను గట్టిగా పట్టుకోగా.. వెంకటయ్య టవల్‌ను గొంతుకు బిగించి ప్రియురాలిని చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోని పొలాల్లో పడేసిన దంపతులు లక్ష్మి ఒంటిపై ఉన్న తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి కడియాలు అపహరించి ఇంటికి వెళ్లిపోయారు. కేసును తప్పుదోమ పట్టించేందుకు మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, గ్లాస్‌లు పడేసి వెళ్లారు.
కేసును ఇలా ఛేదించారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మి ఎవరితో సన్నిహితంగా ఉండేది.. ఆమె హత్యకు గురైన రోజు ఏం జరిగిందనే గ్రామస్తులతో ఆరా తీశారు. 15వ తేదీ అమృతమ్మ, వెంకటయ్య దంపతులు తమ పొరుగింటి పిల్లలతో రెండుసార్లు మద్యం తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈకోణంలో భార్యాభర్తలను ఆరా తీయగా వారు చెప్పిన మాటలకు పొంతన కుదరలేదు. దీంతోవారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే చంపేశామని నేరం అంగీకరించారు. అనంతరం వారి నుంచి లక్ష్మికి సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కుల్కచర్ల ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్, కానిస్టేబుళ్లు పాండు, చెన్నయ్యలకు రివార్డుకు సిఫారసు చేస్తామని సీఐ ప్రసాద్ తెలిపారు.