భార్యను హత్య చేసిన కానిస్టేబుల్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : నాపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కడతేర్చాడు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కానిస్టేబుల్ నర్సిరెడ్డి, ఆయన భార్య విజయలక్ష్మి(25) యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లోని క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. అయితే నాలుగైదు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సిరెడ్డి తన భార్యను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
కాగా శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లిన నర్సిరెడ్డిని సహచర ఉద్యోగులు ఈ విషయమై ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం చెందిన నర్సిరెడ్డి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తనపై అధికారులకు, సహచరులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భార్య విజయలక్ష్మిని బలంగా కొట్టాడు. గోడకేసి కొట్టడంతో ఆమె తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు స్పందించి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. కాగా నర్సిరెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, భార్య తనకు సరిగా అన్నం వండిపెట్టడం లేదని పోలీసుల విచారణలో నర్సిరెడ్డి వెల్లడించాడు. నర్సిరెడ్డి దంపతులకు వరుణ్ రెడ్డి(3), పూజితా రెడ్డి(5) సంతానం.