
బోనాలు షురూ..
చారిత్రక గోల్కొండ కోటలో బోనాల సందడి షురూ అయింది...
నగరంలో బోనాల సందడి షురూ అయింది. చారిత్రక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మంత్రులు నాయిని, పద్మారావులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
- గోల్కొండ కోటలో ప్రారంభమైన జగదాంబిక అమ్మవారి బోనాలు
- భారీ సంఖ్యలో మొక్కులు తీర్చుకున్న మహిళలు
- తొలిసారిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ...
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు నాయిని, పద్మారావు
లంగర్‌హౌస్/గోల్కొండ: చారిత్రక గోల్కొండ కోటలో బోనాల సందడి షురూ అయింది. తెలంగాణలోనే తొలిగా ఆదివారం శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి..నెత్తిన బోనం ఎత్తుకొని గోల్కొండ కోటకు బయల్దేరారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అమ్మ బెలైల్లినాదీ..చల్లగ చూడు లక్ష్మమ్మో... అమ్మ లక్ష్మమ్మా అనే భక్తి గీతాలతో ఊరేగింపు సాగింది.
గోల్కొండ బోనాల చరిత్రలోనే మొదటిసారిగా దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ బోనాలకు నగరం నలుమూలలతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. చోటా బజార్‌లోని అమ్మవార్ల పూజారి ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపు ప్రారంభమయ్యింది. మహిళలు తొట్టెలకు పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఊరేగింపులో ప్రదర్శించిన భారీ అమ్మవారి విగ్రహం అందరిని విశేషంగా ఆకర్షించింది.
తొట్టెలు సమర్పించారిలా..
ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించేందుకు తెచ్చిన భారీ తొట్టెలను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని కోట మేయిన్‌గేటు, క్లాపింగ్ పోర్టికో, నాగదేవత ఆలయం గుండా కోటపైకి తీసుకుపోయి అమ్మవారికి సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేందర్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు గోవిందరాజ కోయల్‌కర్, నాగులపల్లి చంద్రకాంత్, చంద్రశేఖర్ గడ్డి, సంఘ సేవకుడు రాజువస్తాద్, టీఆర్‌ఎస్ నాయకులు టి.జీవన్‌సింగ్, కావూరి వెంకటేష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సత్యంరెడ్డి, బుచ్చిరెడ్డి, ఎ.పరమానందం తదితరులు పాల్గొన్నారు.
వెల్లివిరిసిన మతసామరస్యం
బోనాల ఉత్సవాల మొదటి రోజు ఊరేగింపునకు ముందు లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు గల దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితి. ఆదివారం కూడా అల్‌హాజ్ షేక్ హనీఫ్ దర్గాల వద్ద ఆలయ అధికారుల తరపున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా గోల్కొండలో ఊరేగింపు పొడవునా స్థానిక ముస్లిం యువకులు హిందూ సోదరులకు స్వాగతం పలికి తాగునీరు అందించి మతసామరస్యాన్ని చాటుకున్నారు.
బారులుతీరిన భక్తులు...
కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుతీరారు. కోట మెట్ల మార్గం మధ్యలో ఉన్న రామదాసు బందీఖాన నుంచే క్యూ మొదలైంది. ఆలయ పూజారులు అనంతచారి, బి.సాయిబాబచారి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుద్దీపాలంకరణతో గోల్కొండ కోట దేదీప్యమానంగా వెలుగులీనింది.
మొదటి, చివరి పూజలు ఇక్కడే...
- పిల్లాపాపలను చల్లంగ కాపాడాలని తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల వేడుకలు అషాడ మాసంలో నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ వేడుకల్లో మొదటి, చివరి పూజను అందుకునేది గోల్కొండ జగదాంబిక అమ్మవారు.
- ఆచారం ప్రకారం లంగర్‌హౌస్ ప్రజలు మొదటి బోనం (నజర్ బోనం) తయారు చేశారు.
- 43 అడుగుల ఎత్తై తొట్టెల అందర్నీ ఆకట్టుకుంది.
- ఒంటిగంట ప్రాంతంలో బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి లంగర్‌హౌస్ చేరుకొని పోతరాజులతో కలిసి బుజిలీ మహంకాళి, నల్లపోచమ్మ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.
- రెండు గంటల ప్రాంతంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
- ఈ సంవత్సరం ప్రత్యేకంగా మంత్రి పద్మారావు అమ్మవారికి కల్లు సమర్పించడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
- పూజారి ఇంట్లో జరిగిన పూజల్లో డీసీపీ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
- దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ బోనాల ఊరేగింపులో సాంస్కృతిక శాఖృబందం ప్రదర్శించిన సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
- వివిధ రకాల సంగీత వాయిద్యాలతో బృందం అందరినీ ఉర్రూతలూగించింది. గోల్కొండ కోట ప్రధాన గేటు ముందు పోతరాజుల విన్యాసాలు అదరహో అనిపించాయి. కోటలోని నగినాబాగ్ ప్రాంగణం శివసత్తుల పూనకాలతో పులకించింది. నాగదేవత పుట్ట వద్ద శివసత్తులు పూనకంతో ఊగిపోవడం చూసి విదేశీ పర్యాటకులు తమ కెమెరాలకు పనిచెప్పారు.
- నగినాబాగ్‌లో పలువురు యువతులు వేసిన బండి ముగ్గులు విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి.