గోల్కొండ (హైదరాబాద్): వారసత్వ కట్టడాలకు, శతాబ్దాల సంస్కృతికి తెలంగాణ పెట్టింది పేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్‌షాహి సమాధుల ప్రాంగణంలో పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు పాలించిన ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. మరిన్ని చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంస్థ 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ముందు ముందుకూడా చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనుల్లో ఆఘాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ సంస్థ సేవలను ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని దీని ఫలితంగా రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను విద్యారి్థగా ఉన్న సమయంలో కుతుబ్‌షాహీ సమాధుల వద్దకు స్కూల్ నుంచి విజ్ఞాన, విహార యాత్రకు వచ్చేవారమని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ రహీమ్ ఆఘాఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment