కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం
శంషాబాద్: గల్ఫ్ దేశాల నుంచి స్మగ్లర్ల ద్వారా అక్రమంగా బంగారాన్ని దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని సీటు కింద అతడు దాచిన 1.22 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎయిర్ ఇండియా 952 విమా నంలో దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడిని అంతర్జాతీయ అరైవల్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద అక్రమ రవాణా వస్తువులు ఏమీ లభించలేదు. కానీ, అతడి కదలికలపై సందేహంతో పాస్‌పోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సదరు ప్రయాణికుడు గత కొద్ది రోజుల్లోనే గల్ఫ్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు.
తాను ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ ప్యాకెట్‌లో 1.22 కేజీల బంగారాన్ని దాచినట్లు తెలిపాడు. అప్రమత్తమైన అధికారులు విమానంలోకి వెళ్లి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈ విమానం శంషాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు దేశీయ సర్వీస్‌గా మారి వైజాగ్‌కు బయలుదేరుతుంది. దీంతో సీటు కింద దాచిన బంగారాన్ని హైదరాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడు వైజాగ్‌కు తీసుకువెళ్లి అక్కడ నుంచి దానిని ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్లు నిందితుడు అధికారులకు వివరించాడు. దుబాయ్‌లోని ఓ స్మగ్లర్ నుంచి రూ.50 వేలకు బంగారం అక్రమ రవాణా చేసేందుకు ఒప్పుకున్నట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment