గోల్డ్‌స్టోన్‌కు గట్టిదెబ్బ | Goldstone Has No Rights In The Lands Of Hydernagar | Sakshi
Sakshi News home page

గోల్డ్‌స్టోన్‌కు గట్టిదెబ్బ

Published Thu, Dec 26 2019 2:27 AM | Last Updated on Thu, Dec 26 2019 2:27 AM

Goldstone Has No Rights In The Lands Of Hydernagar  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెను సంచలనం సృష్టించిన వేల కోట్ల  విలువైన హైదర్‌నగర్‌ గ్రామంలోని 196 ఎకరాల భూముల స్కాం కేసులో గోల్డ్‌స్టోన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు ఇతరులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్‌ స్టోన్‌ ఎక్స్‌పోర్ట్స్, మరో 16 మంది దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లు, అనుబంధ పిటిషన్లు అన్నింటినీ కొట్టేస్తూ ఇటీవల కీలకతీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం  తీర్పు వెలువరించింది. దీంతో 60 ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అత్యంత విలువైన ఈ భూముల వివాదానికి తెరపడింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 172 సహా అప్పీల్‌ పిటిషన్లల్లో పేర్కొన్న భూములు జాగీర్‌ భూములేనని స్పష్టం చేసింది.

నిజాం కాలంలో 1948కి పూర్వమే వాటిని ఈనాం ఇచ్చారని పేర్కొంది. సర్వే నంబర్‌ 172తో సహా ఈ భూములపై పిటిష నర్లు ఖుర్షీద్‌ జా పైగా.. మాతృక ఆస్తి నుంచి ప్రాథమిక డిక్రీ ద్వారా భూములపై హక్కులు పొందినట్లుగా గోల్డ్‌స్టోన్‌ కంపెనీ ఇతరులు రుజువు చేసుకోలేకపోయారని తేల్చింది. ఖుర్షీద్‌ జా పైగాకు చెందిన భూముల్లో కొన్నింటిని రుకియా బేగం, వారిస్‌ అలీ, ఘనీ షరీఫ్, బొడ్డు వీరస్వామి ఇతరులు 1948కి ముందే నిజాం కాలంలోనే సాగు చేసుకున్నారని, భూముల్ని సాగు చేసినట్లుగా పట్టాలు ఉన్నాయంది. వారి నుంచి కొనుగోలు చేసిన వారికే భూములపై హక్కులు ఉంటాయని.. ఖాసిం నవాజ్, సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి కొనుగోలు చేసిన వారికి ఏ హక్కులు ఉండవని తెలిపింది. నిజాం స్టేట్‌ భారత్‌లో విలీనం కాకముందే రైతులకు భూములపై హక్కులు సంక్రమించా యని, హైదరాబాద్‌ జాగీర్‌ అబాలిషన్‌ రెగ్యులేషన్, 1358 ఫసలీ (1947) రాక ముందే వారికి సాగు నిమిత్తం పట్టాలు ఉన్నందున ఇవి ప్రభుత్వ భూములు కావని పేర్కొంది.

ఆ డిక్రీ చెల్లదు..: ఈ భూముల విషయంలో కోర్టును తప్పు దారి పట్టించి 1963, జూన్‌ 28న కింది కోర్టు నుంచి పొందిన డిక్రీ చెల్లదని తేల్చింది. 1996 బెయిలీఫ్‌ నివేదిక ఆధారంగా సర్వే నంబర్‌ 172లోని భూమిని ప్రతివాదుల నుంచి స్వాధీనం చేసుకోవడం చెల్లదని, ఆ భూమిని తక్షణమే ప్రతివాదులకు అప్పగించాలని ఆదేశించింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 172లో 98 ఎకరాల 10 కుంటల భూమి విషయంలో 1998లో తుది డీక్రీ ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. ఇదే వివాదంపై రంగారెడ్డి జిల్లా కోర్టు 1996లో జారీ చేసిన ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్‌ వారెంట్లు, బెయిలీఫ్‌ చట్ట వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. 2004లో హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement