నిరుద్యోగ యువతకు శుభవార్త | Good news for to unemployed youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు శుభవార్త

Published Fri, Jul 11 2014 12:55 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

నిరుద్యోగ యువతకు శుభవార్త - Sakshi

నిరుద్యోగ యువతకు శుభవార్త

* రాజీవ్ యువశక్తి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
* ఆగస్టు 8వ తేదీ వరకు గడువు
 
అర్హతలు ఇవీ..
* 18 నుంచి 35ఏళ్లలోపు వయసు ఉండాలి.
* పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన వారు అర్హులు. వృత్తి విద్య శిక్షకులకు సైతం అవకాశం ఉంది.
* ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5వ తరగతి వరకు విద్యార్హత ఉండాలి.
* వార్షిక ఆదాయం రూ.50వేలు ఉండాలి.

 ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువశక్తి రుణాలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం 2014-15 సంవత్సరానికి గాను 365 యూనిట్లు మంజూరు చేయనుంది. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు జిల్లా యువజన సర్వీసుల శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ఫారాలు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు చేరాయి. మండలాలు, మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసి రుణాలు అందిస్తారు.

రుణ సబ్సిడీ రూ.30వేలు ఉంటుంది. రూ.60వేలు రుణం తీసుకున్న వారికి సగం ప్రభుత్వం చెల్లించనుండగా.. రూ.30వేలు సబ్సిడీ లభిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు రుణాలు తీసుకునే వారు 10శాతం బ్యాంకులు డిపాజిట్ చేయాలి. రూ.60వేల రుణం తీసుకునే వారు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆగస్టు 8లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.
 
జిల్లా ఎంపిక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్
రాజీవ్ యువశక్తి పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. అర్హులను కలెక్టర్ సమక్షంలోనే ఎంపిక చేస్తారు. జిల్లా కమిటీలో బ్యాంకు మేనేజర్, స్టెప్ సీఈవో, డీఆర్డీఏ పీడీలు సభ్యులు ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో, సభ్యులుగా ఐకేపీ, డీఆర్డీఏ రిప్రజెంటెటివ్, యువజన సర్వీసుల శాఖ, బ్యాంకర్లు సభ్యులుగా ఉంటారు. మున్సిపాల్టీలో కమిషనర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ, బ్యాంకర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల, మున్సిపాల్టీలో సంయుక్తంగా సదస్సులు, ఇంటర్వ్యూలు, ప్రజాపథం, సంయుక్తగా గుర్తింపు కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి యువజన సర్వీసుల శాఖకు పంపిస్తారు.
 
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
నిరుద్యోగ యువతీ, యువకులు రాజీవ్ యువశక్తి స్వయం ఉపాధి రుణాల కోసం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆయా కార్యాలయాలతోపాటు స్టెప్ కార్యాలయంలోనూ దరఖాస్తులులభిస్తాయి. దరఖాస్తు పూర్తి చేసి ఫొటో అతికించాలి. బ్యాంకు రుణం ఇచ్చేందుదకు అనుమతి పత్రం జోడించాలి. ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్‌లకు దరఖాస్తులు అందజేయాలి. వారు అర్హులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపిస్తారు.
 
రుణాలు..
ఫ్లోర్‌మిల్లు, ఆటోరిక్షా, జిరాక్స్ మిషన్, కాంక్రీట్ మిషన్, మెకానికల్ వర్క్‌షాప్, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, డీటీపీ సెంటర్, సిమెంట్ బ్రిక్స్, క్లినికల్ లేబరేటరీస్, సెంట్రింగ్ వర్క్, ఫొటో, వీడియోగ్రఫి, మోటార్ వైండింగ్, వెల్డింగ్ వర్క్స్ తదితర రుణాలు అందిస్తారు. కిరాణ, జనరల్ స్టోర్‌లు, క్లాత్ బిజినెస్, కూరగాయల దుకాణాలు, ప్యాన్సిస్టోర్‌లకు రుణాలు ఇవ్వరు.
 
రిజర్వేషన్లు
స్వయం ఉపాధి రుణాల్లో రిజర్వేషన్ కల్పించారు. మండల, జిల్లా స్థాయిలోనూ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీలకు 18 శాతం, బీసీలకు 27 శాతం, ఎస్టీలకు 18 శాతం, మహిళలకు 33 శాతం, మైనార్టీలకు 11 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించారు.
 
మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు
రుణాలు ఇప్పిస్తామని మభ్యపెట్టే, మోసగించే మాటలు నిరుద్యోగ యువతీ, యువకులు నమ్మవద్దు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి. అర్హులైన వారికి రుణాలు తప్పక అందిస్తాం. రాజీవ్ యువశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 - వెంకటేశ్వర్లు, యువజన సర్వీసుల శాఖ సీఈవో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement