కరీంనగర్ కార్పొరేషన్: హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా జనసందోహం ఎక్కువగా వచ్చిపోయే వ్యాపారాలకు పార్కింగ్ స్థలాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులకు ఇవేమి కనిపించడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హడావిడి చేస్తున్న అధికారులు చిన్నా చితకా వ్యాపారులపై ప్రతాపం చూపెడుతూ బడా వ్యాపారులను వదిలేస్తున్నారు. దీంతో స్వామి కార్యం.. స్వకార్యం రెండూ సిద్ధిస్తున్నాయి. ఇలా చూసీచూడనట్లు వదిలేయడంతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలానెలా ఇంత అంటూ వసూళ్లు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్‌లు లేకపోయినా నడిరోడ్డుపై వాహనాలు నిలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దుకాణాలపై చర్యలు చేపట్టాల్సింది పోయి వారికే వత్తాసు పలుకడం చర్చనీయాంశంగా మారింది.
పార్కింగ్‌లపై దృష్టేదీ..
కరీంనగర్ స్మార్ట్‌సిటీగా అవతరించిన తర్వాత దేశంలో ఒక మంచి నగరంగా గుర్తింపు పొందేలా తయారు చేయాల్సిన అధికారులు ఆ వైపుగా ఆలోచించడం లేదు. రోడ్లు, డ్రెయినేజీ కడితేనే స్మార్ట్‌సిటీ అనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగించడం తమ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్ల ముందు చేసే పార్కింగ్‌లను ఒక ఆర్డర్‌లో పెట్టేందుకు కనీసం ఒక వాచ్‌మెన్ నియమించుకోవాలన్నా ఇంగిత జ్ఞానం కూడా ఆయా వ్యాపారులకు లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రక్షణ చర్యలు కరువు
టిఫిన్ సెంటర్ల వద్దకు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్‌లు చేయాల్సి వస్తోంది. దీంతో వారి వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. వాహనాలు దొంగతనం జరగడం, ఒకరి వాహనాలు ఒకరు తీసుకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసినా రూంలో మాత్రమే పెట్టుకొని బయట వాహనాలను గాలికి వదిలేయడం వంటివి జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగినప్పటికీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో కనీసం తమ వాహనం దొంగతనం జరిగిందా.. ఎవరైనా తమ వాహనం అని మర్చిపోయి తీసుకెళ్లారా? అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనం ఇతరులు తీసుకెళ్తే వారు తెచ్చి ఇచ్చే వరకు టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు మానుకొని తమ వాహనం కోసం తిరగాల్సి వస్తోంది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం.
అధికారుల నిర్లక్ష్యం..
కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు పార్కింగ్‌ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్కింగ్‌లు లేకపోయినా.. రోడ్డుపై అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కమాన్‌చౌరస్తా, బస్టాండ్ వద్ద, తెలంగాణచౌక్‌లో, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఇలా ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ల సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మంది వ్యాపారులైతే పార్కింగ్‌లు క్రమపద్ధతిలో పెట్టుకునేందుకు సెక్యూరిటీని కూడా నియమించడం లేదు. పైగా కష్టమర్లయిన వాహనదారులపైనే దురుసుగా ప్రవర్థిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పార్కింగ్‌లు లేని వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పార్కింగ్ లేకున్నా యథేచ్ఛగా పర్మిషన్లు
Published Sat, Dec 8 2018 4:03 PM | Last Updated on Sat, Dec 8 2018 4:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment