‘విశ్వ’మంత సంబరం.. | government accepted to set up university in district | Sakshi
Sakshi News home page

‘విశ్వ’మంత సంబరం..

Published Thu, Nov 13 2014 3:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

government accepted to set up university in district

ఆదిలాబాద్ టౌన్ : జిల్లా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఏళ్ల కల సాకారం కాబోతోంది. జిల్లాలో యూనివర్సిటీ లేక ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాల్సిన పరిస్థితికి ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. చదువుల కోసం ఇక హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో ఈ కల సాకారం కానున్నట్లు కళాశాల యాజమాన్యం, మేధావులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధుల కోసం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా)కు ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం.

 సాకారం కానున్న కల..
 1957లో ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువులు కొనసాగేవి. ఆ తర్వాత ఇంటర్ కళాశాలను వేరు చేసి పూర్తిస్థాయిలో డిగ్రీ తరగతులు బోధిస్తున్నారు. కళాశాలకు 15 ఎకరాల స్థలం ఉంది. దీంతోపాటు యూనివర్సిటీ కోసం పట్టణ సమీపంలోని సర్వే నెం.72లో 25 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు.

యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల మండలాల వారు ఆదిలాబాద్‌లోనే పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, డిప్లొమా కోర్సు లు చదివే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనివర్సిటీ లేకపోవడంతో వరంగల్‌లోని కాకతీయ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు, కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపలేక డిగ్రీకే పరిమితం చేస్తున్నారు. మరికొంత మంది మహారాష్ట్రలోని నాందేడ్, యవత్‌మాల్ జిల్లాలో పీజీ చదువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పడుతుండడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

 రూ.55 కోట్లు..
 యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ ఉచ్చ తర్ శిక్ష అభియాన్ (రూసా) ద్వారా రూ.55 కోట్లు మంజూరు కానున్నట్లు సమాచారం. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను మోడల్ డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి రూ.12 కోట్లు కేటాయింపు ఉంటుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ నిధులతో యూనివర్సిటీ అభివృద్ధి జరగనుంది. మౌలిక వసతులు, తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 15 శాఖలు ఏర్పాటవుతాయని కళాశాల యాజమాన్యం పేర్కొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement