
రుణ మాఫీపై మోసగిస్తున్న ప్రభుత్వం
ఆర్మూర్ : ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు *లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అన్ని సీఎం కేసీఆర్ ప్రస్తుతం కుటుంబానికి మాత్రమే లక్ష మాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగా రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి హామీలు గుప్పించిన కేసీఆర్ అధికారం కైవసం చేసుకోగానే మాట మార్చడం తగదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు లక్ష లోపు రుణ మాఫీని చేయాలని డిమాండ్ చేశారు. వర్షభావ పరిస్థితుల్లో సాగు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోరు బావులపైనే ఆధారపడి వారు పంటలు పండిస్తున్నారన్నారు. అయితే ఎన్నికల సమయంలో వ్యవసాయ రంగానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తారన్న కేసీఆర్ ప్రస్తుతం రెండు గంటలే సరఫరా చేయడేమంటని ప్రశ్నించారు. కేసీఆర్ మోసపూరిత హామీలను గుర్తించిన రైతులు ఉద్యమం బాట పడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మనగడనే ప్రశ్నార్థకమవుతుందన్నారు.
22న జాతీయ అధ్యక్షుడి రాక
ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్లు పల్లె గంగా రెడ్డి తెలిపారు. తొలిసారిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్ఛేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు హాజరు కావాలని ఆయన సూచించారు.