ఆసరాపై ఆరా
- సామాజిక తనిఖీకి నిర్ణయం..
- గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు
- ఇంకా కావాలంటూ రోడ్డెక్కుతున్న జనం
- ఆలోచనలో పడిన సర్కారు
- లబ్ధిదారుల ఇంటింటి సర్వేకు శ్రీకారం!
- మున్సిపాలిటీలు, నగర పంచాయితీలపైనే ప్రధాన దృష్టి
- నెలాఖరు నుంచి తనిఖీలు షురూ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బోగస్ ‘ఆసరా’ పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలోగా లబ్ధిదారుల ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నా.. ఇంకా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల కోసం జనం రోడ్డెక్కుతున్న వైనంతో సర్కారు ఆలోచనలో పడింది. దీంతో సామాజిక సర్వేకు శ్రీకారం చుడుతోంది.
ఎందుకిలా జరుగుతోంది?
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారుల హయాంలో కంటే 50 వేల మందికి ఎక్కువగా పింఛన్లు ఇస్తోంది. అయినా, ఇంకా పింఛన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ప్రభుత్వం వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేకు ఆదేశించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో మొత్తం ఫించనుదారుల్లో 20 శాతం మంది అనర్హులున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమై న సర్కారు అన్ని జిల్లాల్లో సర్వేల నిర్వహణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలందాయి.
ఆ ఉత్తర్వులే ఆధారంగా..
ఆసరా పింఛన్లకు సంబంధించి జారీ చేసిన జీవోలోనే ప్రభుత్వం సామాజిక తనిఖీ అంశాన్ని పొందుపర్చింది. దీని ఆధారంగానే ఇప్పుడు సామాజిక తనిఖీలకు సిద్ధమైంది. పింఛన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ.. వికలత్వం నిర్ధారణలో వైద్యులు అవినీతికి పాల్పడుతున్న దాఖలాలున్నాయి.
కల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉ న్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల స్థాయిలోనే ఈ భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉం డటంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులనూ పెన్షనర్ల జాబితాలో చే రుస్తున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు.
పెరిగిన భారం....
ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి పింఛన్‌దారులు మొత్తం 3,00,482 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3,47,430కి చేరింది. గత ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ 8.18 కోట్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.33.9 కోట్లు చెల్లిస్తోంది. నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కి పెంచారు. పెన్షనర్లలో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతాని కంటే భారీగా పెరిగారు. అయినా ఇంకా పింఛన్లు కావాలని జనం రోడ్డెక్కుతుండటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తోంది.
సమగ్ర సర్వే ప్రామాణికం
ఉపాధి హామీ పథకంలో మాదిరిగానే ఆసరా పెన్షన్లలోనూ సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. తనిఖీలో అనర్హులు బయటపడితే గ్రామసభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలగిస్తారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు వారికి చెల్లించిన సొమ్మునూ రికవరీ చేస్తారు.