Support pensions
-
పెన్షన్ దొంగల ముఠా అరెస్ట్ !
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ వృద్ధుల ఆసరా పెన్షన్ల పథకంలో కుంభకోణానికి పాల్పడిన ముఠాలోని నలుగురిని సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంపై హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళఙతే... పాత బస్తీకి చెందిన 250మంది ఆసరా పెన్షన్లను ఈ ముఠా మూడు నెలల నుండి డైవర్ట్ చేస్తున్నట్లు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇమ్రాన్ సోహెల్ అస్లాం సహాయంతో ఎమ్మార్వో పాస్‌వర్డ్‌తో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్నిసార్లయినా విత్‌డ్రా.. నో చార్జీ
- పోస్టల్ ఏటీఎం విత్‌డ్రాలపై నో సర్వీస్ చార్జీ - రూ. 50తోనే ఖాతా.. ఏటీఎంల్లో ఎనీటైం నగదు - తెలంగాణ తంతి తపాలా సర్కిల్ సంచాలకులు వీవీ సత్యనారాయణ రెడ్డి సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఏటీఎం విత్ డ్రాలపై సర్వీస్ చార్జీ లేదని, ఎన్ని పర్యాయాలైనా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని తెలంగాణ తంతి తపాలా సర్కిల్ సంచాలకులు వీవీ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ ఏటీఎంల్లో అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు పనిచేస్తాయని, ఇతర బ్యాంకు ఏటీఎంల మాదిరిగా మూడు విత్‌డ్రాలు దాటగానే సర్వీస్ చార్జీ పడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఏటీఎంల్లో ఎనీ టైం నగదు అందుబాటులో ఉంటుందని వివరించారు. పోస్టాఫీసుల్లో రూ.50తో సేవింగ్ ఖాతా తెరవచ్చన్నారు. పోస్టల్ బ్యాంక్ ఖాతాలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు పోస్టాఫీసుల ద్వారానే అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని చోట్ల విస్తరిస్తామన్నారు. ఆధార్ అప్డేట్, ఎన్రోల్ మెంట్ కేంద్రాలను కూడా త్వరలో ప్రారం భించనున్నట్లు చెప్పారు. పోస్టల్ శాఖ జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, బాలికల, సీనియర్ సిటిజన్ తదితర పథకాలను అమలు చేస్తోం దన్నారు. పోస్టాఫీసులను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. -
పండుటాకుల పరేషాన్..!
మిర్యాలగూడలో తోపులాట.. 12 మంది ఆసరా లబ్ధిదారులకు గాయాలు మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు పోస్టాఫీసు వద్ద బుధవారం ఆసరా పింఛన్లకు క్యూలైన్లో నిలబడిన వృద్ధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు 400 మందికి పైగా వృద్ధులు క్యూలో నిల్చున్నారు. కాగా, ఈ క్యూలైన్లో తోపులాట చోటుచేసుకుని కిందపడ్డారు.దీంతో నాగమ్మ, కాశమ్మ, పద్మ, లింగమ్మ, నర్సమ్మ, సజ్జల అచ్చమ్మ, శ్రీదేవి, రంగమ్మ, ఫాతిమ, జానమ్మ, సరోజ, రాములమ్మ అనే 12 మంది వృద్ధులకు గాయాలయ్యాయి. కాగా, ఈ తోపులాట విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ కిషన్‌రావు పోస్టాఫీసును సందర్శించి క్యూలో నిలబడిన వారితో మాట్లాడారు. క్యూలో నిలబడిన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేయాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. -
జీవించే ఉన్నారా?
♦ జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమం ♦ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘ప్రయోగం’ ♦ జూన్ 1 నుంచే అమల్లోకి.. ♦ ‘లైవ్ సర్టిఫికెట్’ ఉంటేనే ‘ఆసరా’ జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. లబ్ధిదారులు జూన్ 1 నుంచి 25లోపు ‘లైవ్ సర్టిఫికెట్ల’ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలి. వాటిని సమర్పించిన వారికే పింఛన్లు. మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమర్పిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆసరా పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పింఛన్ దారుడు ఇకపై జీవించి ఉన్నట్టు నిర్ధారణ (లైవ్ సర్టిఫికెట్) పత్రాన్ని సమర్పిస్తేనే పింఛన్ డబ్బులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడికే పింఛన్ డబ్బులు అందిస్తుండగా.. పట్టణ ప్రాంతంలో మాత్రం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమచేస్తున్నారు. ఈక్రమంలో లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి కుటుంబీకులు పింఛన్ డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారు. ఈక్రమంలో మరణించిన వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఉపక్రమించిన యంత్రాంగం.. జీవించి ఉన్నట్లు నిర్ధారించే సర్టిఫికెట్లను లబ్ధిదారుల నుంచి కోరుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా ప్రాంతానికి చెందిన లబ్ధిదారులంతా జూన్ 1వ తేదీ నుంచి 25లోపు ఈ సర్టిఫికెట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించిన వారికే పింఛన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. అల్వాల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలోని ఈ లబ్ధిదారులకు పింఛన్ డబ్బును బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తాజా నిర్ణయంతో ఈ సర్కిళ్లలోని లబ్ధిదారులు లైవ్ సర్టిఫికెట్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. ఇందుకుగాను సమీప మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమరిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా యంత్రాంగం సాఫ్ట్వేర్ తయారు చేసింది. ఇందుకు సంబంధించి మీసేవ నిర్వాహకులకు రెండ్రోజుల క్రితం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్లు సమర్పించకుంటే వారికి వచ్చే నెల నుంచి ఆసరా ఫించన్ నిలిచిపోనుంది. -
ఆసరా ఆలస్యం!
వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆసరా పింఛన్లు ఆలస్యమవుతున్నాయి. నెలాఖరు కావొస్తున్నా ఇప్పటి వరకు వారి చేతికి డబ్బులు అందలేదు. దీంతో పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. పింఛన్ ఎప్పుడొస్తుందా అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. * ప్రతినెలా ఇదే తంతు * నేటికీ అందని పింఛన్ * 5.41 లక్షల మంది ఎదురుచూపు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే. గతంలో వృద్ధులు, వితంతవులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. వీరితోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకూ రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తోంది. అయితే గతంలో పింఛన్లు ప్రతినెలా ఒకటో తారీఖునే వచ్చేవి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతినెలా ఒకటో తారీఖున పింఛన్ డబ్బు తీసుకునేవారు. కానీ గత కొద్దినెలలుగా పరిస్థితి భిన్నంగా మారింది. ప్రతినెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుందనే సంతోషం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల్లో కనిపిస్తున్నా... ఆ సొమ్ము ఏ రోజు ఇస్తారో తెలియక సతమతమవుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నెలాఖరు దాకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ కోసం వాకబు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 5.44 లక్షల మంది జిల్లావ్యాప్తంగా ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులు, 3,220 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరికి ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. వీరుగాక అభయహస్తం కింద 19,823 మంది మహిళలకు ప్రతినెలా రూ.4.08 కోట్లు చెల్లిస్తోంది. ఆయా మొత్తాన్ని ప్రభుత్వం గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతోంది. ప్రతినెలా 15 వరకు ఆ మొత్తాన్ని ఎంపీడీవోలకు జమ చేస్తుండగా, అక్కడి నుంచి గ్రామ కార్యదర్శులకు వారి ద్వారా పింఛన్ దారులకు నెలాఖరులోపు చెల్లిస్తున్నారు. సుమారు 3,66,280 మంది పింఛన్‌దారులు గ్రామ కార్యాదర్శుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు. మిగిలిన వారి విషయానికొస్తే... జిల్లాలో 182 గ్రామ పంచాయతీల్లో వీఎల్ఈ/సీబీఎస్ల ద్వారా నేరుగా 82,422 మంది పింఛన్‌దారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. పట్టణాల విషయానికొస్తే.. జిల్లాలోని 93,261 మంది పింఛన్‌దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ సొమ్ము జమ అవుతోంది. అయితే పింఛన్ సొమ్ము మాత్రం ఏ రోజు జమ అవుతుందో తెలియక వృద్ధులు, వితంతవులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము అందనేలేదు. అధికారులను అడిగితే ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయంపై అధికారులను వాకబు చేయగా ప్రభుత్వం నుంచి బుధవారమే డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయని, నెలాఖరులోపు పింఛన్ అందజేస్తారని పేర్కొనడం గమనార్హం. ఆఫీస్ చుట్టూ తిరుగుడే పింఛన్‌కోసం రోజు గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు పైసలిత్తరో తెలుస్తలేదు. పైసలస్తే సమ్మక్కజాతరకు పోదామనుకున్నా... పైసల కోసం పట్టించుకునేటోల్లే లేరు. - అగ్గి భూదేవి వృద్ధురాలు -
ఆసరాపై ఆరా
- సామాజిక తనిఖీకి నిర్ణయం.. - గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు - ఇంకా కావాలంటూ రోడ్డెక్కుతున్న జనం - ఆలోచనలో పడిన సర్కారు - లబ్ధిదారుల ఇంటింటి సర్వేకు శ్రీకారం! - మున్సిపాలిటీలు, నగర పంచాయితీలపైనే ప్రధాన దృష్టి - నెలాఖరు నుంచి తనిఖీలు షురూ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బోగస్ ‘ఆసరా’ పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలోగా లబ్ధిదారుల ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నా.. ఇంకా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల కోసం జనం రోడ్డెక్కుతున్న వైనంతో సర్కారు ఆలోచనలో పడింది. దీంతో సామాజిక సర్వేకు శ్రీకారం చుడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారుల హయాంలో కంటే 50 వేల మందికి ఎక్కువగా పింఛన్లు ఇస్తోంది. అయినా, ఇంకా పింఛన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ప్రభుత్వం వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేకు ఆదేశించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో మొత్తం ఫించనుదారుల్లో 20 శాతం మంది అనర్హులున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమై న సర్కారు అన్ని జిల్లాల్లో సర్వేల నిర్వహణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలందాయి. ఆ ఉత్తర్వులే ఆధారంగా.. ఆసరా పింఛన్లకు సంబంధించి జారీ చేసిన జీవోలోనే ప్రభుత్వం సామాజిక తనిఖీ అంశాన్ని పొందుపర్చింది. దీని ఆధారంగానే ఇప్పుడు సామాజిక తనిఖీలకు సిద్ధమైంది. పింఛన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ.. వికలత్వం నిర్ధారణలో వైద్యులు అవినీతికి పాల్పడుతున్న దాఖలాలున్నాయి. కల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉ న్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల స్థాయిలోనే ఈ భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉం డటంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులనూ పెన్షనర్ల జాబితాలో చే రుస్తున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. పెరిగిన భారం.... ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి పింఛన్‌దారులు మొత్తం 3,00,482 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3,47,430కి చేరింది. గత ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ 8.18 కోట్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.33.9 కోట్లు చెల్లిస్తోంది. నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కి పెంచారు. పెన్షనర్లలో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతాని కంటే భారీగా పెరిగారు. అయినా ఇంకా పింఛన్లు కావాలని జనం రోడ్డెక్కుతుండటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తోంది. సమగ్ర సర్వే ప్రామాణికం ఉపాధి హామీ పథకంలో మాదిరిగానే ఆసరా పెన్షన్లలోనూ సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. తనిఖీలో అనర్హులు బయటపడితే గ్రామసభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలగిస్తారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు వారికి చెల్లించిన సొమ్మునూ రికవరీ చేస్తారు. -
‘ఆసరా’పై సామాజిక తనిఖీ
నల్లగొండ : ‘ఆసరా’ పెన్షన్లలో చోటు చేసుకున్న అక్రమాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో భారీ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం పింఛన్‌దారుల్లో 20 శాతం మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలు ఇచ్చారు. ఆస రా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే సామాజిక తనిఖీ అంశాన్ని పొ ందుపర్చారు. కానీ పథకం ప్రారంభదశలోనే దీనిని అమలు చేస్తే అన్ని వైపుల నుంచి విమ ర్శలు వస్తాయన్న అభిప్రాయంతో మొదట్లో వెనక్కి త గ్గింది. ఆసరా పెన్షన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి...అందుకు బాధ్యులైన నలుగురు పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించారు. కానీ ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. గ్రామాలతో పోలిస్తే...మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనే భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులకు సమాచారం ఉంది. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులను కూడా ఆసరా పెన్షన్లలో చోటు కల్పించినట్లు పక్కా సమాచారం సేకరించిన అధికారులు తమ ఫోకస్ అంతా వాటిపైనే పెట్టారు. పింఛన్లు-కుటుంబాలు పెరిగాయ్... ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలుపుకుని పింఛన్‌దారులు మొత్తం 3,94,717 మంది ఉండగా...ప్రస్తుతం 4,02,509 మంది ఉన్నారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 8.34 లక్షలు ఉంటే...సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ సంఖ్య 11.35 లక్షలకు పెరిగాయి. దీంతోపాటు నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పింఛన్ ఐదు వందల నుంచి రూ.1500లకు పెంచారు. పింఛదారుల్లో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతంలో ఉన్నవాటి కి మించి భారీగా పెరిగారు. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికి వికలత్వాన్ని నిర్ధారించడంలో వైద్యులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనగల్, తిరుమలగిరి మండలాల్లో బోగస్ సదరమ్ సర్టిఫికెట్లు ద్వారా పింఛన్ పొందడాన్ని పసిగట్టిన అధికారులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. క ల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉన్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆసరాలో అనర్హులు ఏరివేయాలంటే సామాజిక తనిఖీ ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికం... ఉపాధి హామీ పథకంలో అమలు చేసిన విధంగానే ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. ఈ తనిఖీలో అనర్హులు తేలినట్లయితే అందరికీ తెలిసే విధంగా బహిరంగ సభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలిగిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, ఇప్పటివరకు చెల్లించిన సొమ్మును రికవరీ చేస్తారు. సామాజిక తనిఖీకి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సెర్ప్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు నుంచి సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. -
ఆసరా..గాభరా!
- జీరో ఖాతాలకు బ్యాంకర్ల కొర్రీలు.. - లబ్ధిదారుల అవస్థలు - జంట జిల్లాల్లో 4.52 లక్షల ఆసరా పింఛన్లు - బ్యాంకు ఖాతాలు 1.51 లక్షలు మాత్రమే - అయోమయంలో 3.01 లక్షల మంది... సాక్షి, సిటీబ్యూరో: పింఛన్లు అందక ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల కొర్రీలు, జీరో ఖాతాల ఓపెనింగ్‌లో కష్టాలతో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారానే సామాజిక పింఛన్లు(ఆసరా) పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లకు సంబంధించి జీరో ఖాతాలు తెరవాలని అధికారయంత్రాంగం బ్యాంకర్లను ఆదేశించినా..సరిగ్గా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే తేదీ (10) దగ్గర పడుతుండటంతో మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఖాతాల కోసం బ్యాంకులకు వెళ్లితే సాయంత్రం లేదా రేపు...ఎల్లుండి రావాలని సమాధానం వస్తుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వికలాంగులు, వృద్ధులైతే బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు తిరగలేక మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. జీరో ఖాతాలు తెరిపించినందుకుగాను దళారులకు రూ.50 నుంచి రూ. 100 వరకు ముట్టజెప్పాల్సివస్తుందంటున్నారు. అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఖాతాలపై బ్యాంకర్లు కనికరించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల ఆసరా పింఛన్లు వరకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోవటం కష్టమని లబ్ధిదారులంటున్నారు. అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వలేమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో మొత్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,52,168 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,65,025 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,87,143 మంది ఉన్నారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఇప్పటి వరకు జంట జిల్లాలలో 1.51 లక్షలే ఆసరా పింఛ న్లతో అనుసంధానమయ్యాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 78 వేలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 73 వేల వరకు ఉన్నాయి. జంట జిల్లాల్లో ఇంకా 3,01,168 ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. దీంతో ఈనెలలో పింఛన్ల పంపిణీపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతుండగా... బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులు మాత్రం పింఛన్ వస్తుందో..రాదోనని టెన్షన్ పడుతున్నారు. -
‘ఆసరా’ అక్రమార్కులపై కొరడా
జిరాక్స్ సెంటర్‌పై పోలీసుల దాడి ఆధార్‌కార్డుల్లో అక్రమాలు బహిర్గతం కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం యాజమానితోసహా 19 మందిపై క్రిమినల్ కేసులు పరకాల : తీగలాగితే డొంక కదిలింది.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లలో అక్రమాలతో దండుకున్న వారు... దురాశతో ఆధార్‌కార్డుల్లో వయసు మార్చి లబ్ధిపొందాలనుకున్న వారు కటకటాలపాలయ్యూరు. ‘మొన్న పరకాల.. ఇటీవల మొగుళ్లపల్లి... అని ఉదహరిస్తూ ఆసరా పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సాక్షి’ జిల్లా మొదటిపేజీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అప్పట్లోనే విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఆసరా పింఛన్ల జాబితాను తీసుకెళ్లి క్షేత్రస్థారుులో నిశిత పరిశీలన చేశారు. ఈ క్రమంలో పరకాలలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న దినేష్ జిరాక్స్ సెంటర్లో ఆధార్‌కార్డుల్లో వయసు మార్చే తతంగం సాగుతున్నట్లు గుర్తించిన ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరకాల సీఐ బి.మల్లయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఎస్సై రవీందర్ జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసి కంప్యూటర్లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆధార్ ఐడీ, యూజర్ పాస్‌వర్డ్‌ను కనుగొని తప్పుడు ఆధార్ కార్డులు(ఫేక్) సృష్టించి ఇ చ్చినట్లు తేలింది. దీంతో దినేష్ జిరాక్స్ సెంటర్ నిర్వహకుడు నూటేంకి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, క్రిమినల్ కేసు నమోదు చేశా రు. దురాశతో అక్రమంగా పింఛన్ పొందాలనుకున్న వెల్లంపల్లికి చెందిన పెండెల సమ్మయ్య, పెండెల రాజయ్య, యాట సారయ్య, రేగూరి సమ్మిరెడ్డి, అనిశెట్టి కొంరయ్య, దేవునూరి మల్లయ్య, ఎం డీ రాజ్బీ, రేగూరి సాం బరెడ్డి, రేగూరి బుచ్చిరెడ్డి, మాటేటి పోశాలు, మంద అయోధ్య, ఎదుల యాదయ్య, మంద పేరయ్య, ఏకు సారయ్య, పెండెల సాంబయ్య, చిన్నరాజయ్య, రావుల ఎల్లయ్య, కడారి సాంబయ్య, బరిగేల సమ్మయ్యపైనా క్రిమినల్ కేసులు నమో దు చేసి చేసినట్లు సీఐ తెలిపారు. ఇలా దొరికారు... మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన 19 మంది పింఛన్ కోసం ఎం పీడీఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నారు. వయసు లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యూరుు. సదరు వ్యక్తులు వాటిలో వయసు మార్చి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అవి మళ్లీ రావడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా, అక్రమ తతంగం వెలుగుచూసింది. -
నేడు పింఛన్ పంపిణీ డౌటే !
ప్రగతినగర్ : ‘ఆసరా’ పింఛన్లు ఈ నెల 5 నుంచిఅందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి పింఛన్ల పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సాంకేతిక కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.‘ఆసరా’కు సంబంధించిన నిధులు ఇప్పటికీ సెర్ప్ నుంచి డీఆర్డీఏ అకౌంట్లో జమ కాలేదు. నిధులు డీఆర్డీఏ అకౌంట్లో జమైన అనంతరం ఎంపీడీఓ అకౌంట్లోకి పింఛన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎంపీడీఓ ఆయా గ్రామ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందిస్తారు. అయితే ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు సమయం పటేలా ఉందని సంబంధిత అధికారికి వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో రెండు నెలల పింఛన్ కలిపి 2,01,982 మందికి రూ. 42 కోట్ల 54 లక్షలు పంపిణీ చేశారు. రూపాయల వరకు అందించారు. గత నెలతో పోలిస్తే జనవరి నెల పింఛన్ పెరిగింది. ఈ నెలలో నిజామాబాద్ అర్బన్‌లో 11,244 మందికి పింఛన్ అందించనున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య మరో వెయ్యి వరకు పెరిగే ఆస్కారం ఉంది.అంతే కాకుండా నిజామాబాద్ మూడు మున్సిపాలిటీలు,అన్ని మండలాలు కలిపి జనవరి నెలకు 2,07,984 మందికి పింఛన్ అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు. వీటికి గాను 23 కోట్ల రుపాయలు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అయితే నిజామాబాద్ అర్బన్‌లో గత నెలలో అప్లోడ్ సీడింగ్ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులకు పింఛన్ అందని విషయం తెలిసిందే.అర్బన్ పింఛన్‌పై గత నెలలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యే సరికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ రంగంలోకి దిగి మున్సిపాల్ అధికారులతో తిరిగి అర్బన్ డాటాను సేకరించారు. వాటిని వెంటనే అప్లోడ్ చేయించి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది అర్హులకు పింఛన్ అందేలా ప్రయత్నించారు. కలెక్టర్ ప్రయత్నం మూలంగా అర్బన్‌లో డిసెంబర్ నెలతో పోల్చుకుంటే దాదాపు మరో 5 వేల మంది లబ్ధిదారులు పెరగనున్నారు. డిసెంబర్లో నిజామాబాద్ అర్బన్ 9,634 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు కాగా 8,576 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు.