అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న సిబ్బంది
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కోవిడ్–19 మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో లేవు. దీంతో అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఒకవైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే, మరోవైపు రోజువారీ ఓపీ సేవలందిస్తోంది. డాక్టర్లు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ సేవలందిస్తున్నారు. ప్రజల మన్ననలను పొందుతున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. కొత్తగూడెంలోని జిల్లా ప్రధానాస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రి, ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట ఆస్పత్రులన్నింటికీ కలిపి రోజూ సగటున సుమారు 600నుంచి 700 మంది రోగులు ఓపీ సేవల కోసం వస్తున్నారు.
వీరితోపాటు రెగ్యులర్ పరీక్షలు, స్కానింగ్ కోసం 150 మందికి పైగా గర్భిణులు వస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది ఎప్పటిలాగే ప్రసవాలతోపాటు అవసరమైన శస్త్రచికిత్సలు సైతం చేస్తున్నారు. మణుగూరులో ఇంకా ప్రారంభం కాని వంద పడకల ఆస్పత్రిని కోవిడ్ క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసి వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డెంటల్, ఛాతి, డయాలసిస్, డయాబెటిస్ పేషెంట్లకు సైతం క్రమ పద్ధతిలో సేవలు అందిస్తున్నారు. రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే సిబ్బంది కూడా విరామమెరగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు అన్ని విభాగాల్లో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్ ఏర్పాటు చేసి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
వెనుకాడేది లేదు
జిల్లాలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సేవలందించే విషయంలో ఏ మాత్రమూ వెనుకాడడం లేదు. కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రులకు రోజూ ఔట్ పేషెంట్లు అధికంగానే వస్తున్నారు. అత్యవసర, బాగా ఇబ్బంది పెట్టే దీర్ఘకాలిక వ్యాధులకు తగినవిధంగా సేవలందిస్తున్నాం. గర్భిణులకు రెగ్యులర్‌గా అందించాల్సిన అన్నిరకాల పరీక్షలు, సేవలు క్రమపద్ధతిలో అందజేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ వైద్యసేవలు అందిస్తున్నాం. –డాక్టర్ రమేష్,జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment