చుంచుపల్లి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాలను ఇంటినుంచే ఇంటర్‌నెట్ ద్వారా సాగిస్తున్నారు. మరి కొందరు కాలక్షేపం కోసం మొబైల్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తూ సినిమాలు, పాటలు, వార్తలు వింటూ గడుపుతున్నారు. దీంతో నెట్ వినియోగం భారీగా పెరిగింది. జిల్లాలో దాదాపు 7 లక్షల మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. సాధారణంగా నెలకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఇంటర్నెట్ కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ‘నెట్’ ఖర్చు రెట్టింపు అయిందని వివిధ మొబైల్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నాయి.
సమస్తం ఇంటర్నెట్‌లోనే..
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. ‘మొబైల్ డేటా’ అన్ చేసి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆన్‌లైన్ షాపింగ్‌లు, నగదు చెల్లింపులతోపాటు అన్ని రకాల బిల్లులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను సైతం ఇంటర్‌నెట్ ద్వారానే చేస్తున్నారు. రకరకాల పుస్తకాలు, గ్రంథాలు కూడా ఇంటర్నెట్‌లో లభిస్తుండటంతో వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇక పిల్లలైతే వివిధ రకాల గేమ్స్‌తో పాటు కార్టూన్లు, పాటలు, సినిమాలు, ఇతర వీడియోలు చూస్తూ సరదాగా గడిపేస్తున్నారు.
యాప్‌లతో తరగతులు..
కరోనా ప్రభావంతో స్కూళ్లు మూతపడడంతో జిల్లాలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్నెట్‌లో పలు యాప్‌ల ద్వారా క్లాసులు భోధిస్తూ హోంవర్కులు ఇస్తున్నాయి. వాటిని చూసి తల్లిదండ్రులు పిల్లలతో రాయించడం, చదివించడం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సెక్టార్లలో పనిచేసే ఉద్యోగులు ఆల్‌లైన్‌లోనే ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించి నిత్యావసర సరుకులను సైతం తెప్పించుకుంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 60 శాతం మంది ఇంటర్‌నెట్‌ను వినియోగించగా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక యాప్ ద్వారా క్లాసులు
లాక్‌డౌన్ మూలంగా అన్ని రకాల అప్లికేషన్స్ మొబైల్ ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. న్యూస్ అప్‌డేట్స్ మొదలు ఇతర అవసరాలను ఇంటి నుంచే పొందుతున్నాం. ప్రస్తుతం మాకు జూమ్‌క్లౌడ్ మీటింగ్స్ యాప్ ద్వారా తరగతులు బోధిస్తున్నారు. న్యాకం సాయితేజ, బీటెక్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment