ప్రభుత్వోద్యోగులకు రాయితీపై ‘స్వగృహా’లు | Government plans to be given on subsidy for government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వోద్యోగులకు రాయితీపై ‘స్వగృహా’లు

Published Wed, Oct 22 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

ప్రభుత్వోద్యోగులకు రాయితీపై ‘స్వగృహా’లు

ప్రభుత్వోద్యోగులకు రాయితీపై ‘స్వగృహా’లు

* బండ్లగూడ ప్రాజెక్టులోని ఫ్లాట్ల అమ్మకానికి ఏర్పాట్లు
* వాయిదా పద్ధతిలో చెల్లింపు వెసులుబాటు కల్పించే అవకాశం
* కసరత్తు చేస్తున్న అధికారులు
* త్వరలో ఖరారు కానున్న ధరలు
* చదరపు అడుగు రూ.2,300గా ఉండే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్:  నిర్మించి ఏళ్లు గడుస్తున్నా కొనేవారు లేక తెల్ల ఏనుగులా మారిపోయిన బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీలైతే వాటి ధరను తగ్గించి రాయితీతో వారికి విక్రయించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుద్రా వెంకటేశం కసరత్తు చేస్తున్నారు. ఒక విభాగానికి సంబంధించి బల్క్‌గా కొంటే ధరను మరింత తగ్గించాలని నిర్ణయించారు. అవసరమైతే వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో అధికారులు విధివిధానాలను రూపొందించబోతున్నారు.
 
 2,800 ఫ్లాట్లు... 9 అంతస్తుల భవనాలు
 మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకే అత్యం త నాణ్యమైన ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రా రంభించిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులో తొలుత సిద్ధమైన భారీ వెంచర్ ఇదే. ఇక్కడ 2,800 ఫ్లాట్లతో కూడిన జీప్లస్ 9 నిర్మాణాలు చేపట్టారు. విశాలమైన ప్రాంగణం, బ్లాకుకు బ్లాకుకు మధ్య ఖాళీ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు పార్కులతో ఈ ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.460 కోట్లను ఖర్చు చేశారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటంతో కష్టాలు మొదలయ్యాయి. నిధులు లేక ఫినిషింగ్ పనులు, మౌలిక వసతుల కల్పన పడకేసింది. దీంతో చూస్తుండగానే అదికాస్తా వృథాగా మిగిలింది.
 
 ఉన్నంతలో అధికారులు మార్కెటింగ్ చేయటంతో ఇప్పటివరకు 600 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అతికష్టమ్మీద మరో వేయి ఫ్లాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. పనులు సాగకుం డా కావాలని పడకేసేలా చేసి గత్యంతరంలేని పరిస్థితి కల్పించి చివరకు వాటిని ప్రైవేటుబిల్డర్ల పరం చేసేందుకు గతంలో కొందరు అధికారులు కుట్ర పన్నటం కూడా ఈ దుస్థితికి కారణమైంది. కమీషన్ల కోసం వారు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉద్యోగులకు అమ్మాలని నిర్ణయించటంతో మళ్లీ పనుల్లో కదలిక మొదలవుతోంది. ప్రస్తుతం అధికారులు వాటిని చదరపు అడుగుకు రూ.2,600 చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీన్ని రూ.2,300 వరకు తగ్గించి అమ్మాలని తాజాగా అధికారులు భావిస్తున్నారు.  
 
 నగరంలోకి మారిన ‘స్వగృహ’ కార్యాలయం
 ఇప్పటి వరకు బండ్లగూడ ప్రాజెక్టులో కొనసాగిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం తాజాగా నాంపల్లికి మారింది. బండ్లగూడ ప్రాజెక్టు దూరంగా ఉండటంతో స్వగృహ ప్రాజెక్టులపై ఆరా తీసే ప్రజలకు ఇబ్బందిగా ఉంది. దీంతో క్రమంగా కార్యాలయానికి ప్రజలు రావటమే బాగా తగ్గిపోయింది. దీంతో కార్యాలయాన్ని తాజాగా నాంపల్లిలోని గగన్‌విహార్ భవనంలోకి మార్చారు. అందులో ఏడో అంతస్తులో కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనసముదాయంలో కార్యాలయం ఉండేది. అప్పట్లో రోజూ కొనుగోలుదారులతో కార్యాలయం సందడిగా ఉండేది. నెలవారీ అద్దె భారంగా మారిందని పేర్కొంటూ దాన్ని బండ్లగూడలోకి మార్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement