
నల్లూర్‌లో వైకుంఠధామానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, బాల్కొండ: గత సాధారణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యాక్రమాలను కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి ప్రారంభోత్సవం, శంకు స్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 57ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేస్తుందన్నారు.
ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడంలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారన్నారు. అందులో కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్ట్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం నిధులు ఎక్కువగా వెచ్చించడం వల్ల ప్రస్తుతం ఇతర పనులు చేపట్టలేక పోతున్నామన్నారు. త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడుతామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎస్సారెస్పీ ఆయకట్టుకు డోకా ఉండదన్నారు. ఇది వరకే కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని ముద్దాడాయన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం వల్ల కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రానప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎంతో అవసరం ఉంటుందన్నారు.
నల్లూర్‌పై మంత్రి నారాజ్..
నల్లూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లపై మంత్రి నరాజ్ అయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో 412 మంది రైతుబంధు, 500 మంది పింఛన్లు పొందుతున్నారన్నారు. 912మంది రాష్ట్ర ప్రభుత్వం వలన ప్రయోజనం పొందిన టీఆర్‌ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో 200 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవాకుడిగా ప్రజలను నుంచి కోరుకునేది ఓటు మాత్రమే అన్నారు. ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
నల్లూర్ గ్రామంలో ఇది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. భవిష్యత్తులో గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో లో వోల్టేజీ సమస్య తీర్చడం కోసం విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామంలో లైబ్రరీ భవనం నిర్మించామన్నారు. కావాల్సిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో ముప్కాల్ మండల ఎంపీపీ సామ పద్మ, జెడ్పీటీసీ బద్దం నర్సవ్వ, వైస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, స్థానిక సర్పంచ్ సుగుణ, ఎంపీటసీ సత్యనారయణ, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో దామోదర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment