అప్పు చేస్తేనే ‘డబుల్’ ఇళ్లు!
బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే
హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్లను అప్పు చేసి కట్టనున్నట్టు బడ్జెట్ గణాంకాల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇప్పటిదాకా కేటాయించిన 2.6 లక్షల ఇళ్లగాను ఇప్పటికి 1,426 ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మరో 16 వేల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మిగతావాటికి పునాది కూడా పడలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వేగంగా పనులు జరిపి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. కేటాయించిన ఇళ్ల పరిపూర్తికే దాదాపు రూ.29 వేల కోట్లు కావాలి.
కానీ తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు. రూ.27 వేల కోట్లు హడ్కో నుంచి రుణంగా పొందాలని, మిగతా మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించాలని అధికారుల చేసిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా రూ.500 కోట్లతోనే ప్రభుత్వం సరిపుచ్చింది. ప్రధాని ఆవాస్ యోజన (పట్టణ)కు రూ.292 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.1,149 కోట్లను కేంద్ర ప్రాయోజితం కింద చూపారు.