
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చే అంశంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఫీజుల నియంత్రణకు ఎన్నిసార్లు ఉత్తర్వులు జారీ చేసినా, యాజమాన్యాలు వాటిపై కోర్టును ఆశ్రయించడం, అవి రద్దు కావడం జరుగుతోంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించినట్లు తెలిసింది. గతంలో డీఎఫ్‌ఆర్‌సీల ఏర్పాటు విధానం సరిగ్గా లేదని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో తాజాగా.. ఓవైపు డీఎఫ్‌ఆర్‌సీలకు చట్టబద్ధత కల్పిస్తూనే రాష్ట్రస్థాయిలో ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేయాలని యోచించింది.
ఈమేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెడతారా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఫీజుల నియంత్రణ విధానాలను ఖరారు చేసేందుకు నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కాల పరిమితిని ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. అధ్యయనం చేసే సమయం ఇంకా ఉండటంతో ఫీజుల నియంత్రణ బిల్లును ఇప్పుడే ప్రవేశ పెట్టే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నారు.