ఏటా 10 శాతం పెంపు! | 10% increment annually! | Sakshi
Sakshi News home page

ఏటా 10 శాతం పెంపు!

Published Sat, Dec 30 2017 4:20 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

10% increment annually! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించింది. అంతకంటే ఎక్కువగా ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. 2016–17 విద్యా సంవత్సరం నాటికి ఉన్న ఫీజులను ప్రమాణికంగా కొత్త నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పాఠశాలల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులకు అనుమతినిచ్చేందుకు జోనల్‌ ఫీజు నియంత్రణ కమిటీలను (జెడ్‌ఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నివేదికను శనివారం ప్రభుత్వానికి అందజేయనుంది. అయితే ఈ నివేదికలోని అంశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల ఫీజుల తగ్గింపు ఉండకపోగా.. ప్రైవేటు యాజమాన్యాల దోపిడీకి మరింత అవకాశమిస్తుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

ఫీజుల తగ్గింపునకు అవకాశమేదీ? 
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అంశంపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల కమిటీలు, సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో చర్చించిన కమిటీ.. శుక్రవారం చివరి సమావేశం నిర్వహించింది. వివిధ అంశాలపై మరోసారి చర్చించింది. అనంతరం ఫీజుల అంశంపై నివేదికను సిద్ధం చేసింది. దీనిని శనివారం ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ప్రొఫెసర్‌ తిరుపతిరావు వెల్లడించారు. అయితే నివేదికలోని అంశాలపై తల్లిదండ్రుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు ఏవని ప్రశ్నించాయి. పాఠశాలలు ఆదాయ, వ్యయాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. వాటిని క్షుణ్నంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్న సిఫారసు లేదని పేర్కొన్నాయి. 

అడ్డగోలుగా పెంచుతున్నారన్న ఫిర్యాదుల మేరకే.. 
రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు స్కూళ్లు ఏటా 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త విధానాన్ని సిఫారసు చేస్తున్నాం. రాష్ట్రంలో పాఠశాలల ఫీజులపై ఇప్పటివరకు ఒక విధానమంటూ లేదు. ఇప్పుడు నియంత్రణలోకి తెచ్చే చర్యలు చేపట్టాం. ప్రతి పాఠశాల గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలివ్వాలని సూచించాం. రాష్ట్రంలో 12 వేల పాఠశాలలుంటే.. 4 వేలకు పైగా పాఠశాలలే నివేదికలు ఇచ్చాయి. మిగతావి ఇవ్వాల్సి ఉంది. విద్యాశాఖ ఆ నివేదికలను పరిశీలించి తగిన చర్యలు చేపడుతుంది. మేం రూ.12 వేల ఫీజు ఉన్న స్కూళ్ల నుంచి రూ.2.5 లక్షల ఫీజున్న స్కూళ్ల వరకు తనిఖీ చేశాం. రెండింటి మధ్య వసతుల్లో చాలా తేడా ఉంది. అయితే వారు లాభాలు గడిస్తున్నారా, లేదా? అన్నది వేరే విషయం. లాభాలు గడిస్తే ఫిర్యాదు చేయవచ్చు. దానిపై విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలి. మేమిచ్చే సిఫార్సులపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. 45 రోజుల్లో ఫీజు చెల్లించకపోతే టీసీ ఇచ్చేయవచ్చన్న నిబంధనను పెట్టలేదు..  
 – ప్రొఫెసర్‌ తిరుపతిరావు

ఇది ఫీజుల దందాకు గ్రీన్‌సిగ్నల్‌ 
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాకు తిరుపతిరావు కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాసింది. మహారాష్ట్రలో రెండేళ్లకోసారి 15 శాతమే పెంచుకోవచ్చు. ఇక్కడ ఏటా 10 శాతానికి అనుమతినిచ్చారు. అంతేకాదు జోనల్‌ కమిటీకి వెళ్లి ఇంకా అధికంగా ఫీజు పెంచుకోవచ్చు. శ్లాబ్‌ విధానానికీ కమిటీ ఓకే చెప్పింది. అంటే ఎల్‌కేజీ నుంచి యూకేజీకి వెళ్తే 10 శాతం ఫీజు పెంపు.. అదే ఒకటో తరగతికి వెళితే శ్లాబ్‌ మారిపోయి. 40–50 శాతం ఫీజులు పెరిగే అవకాశముంటుంది. ఇప్పటికే అనేక స్కూళ్లు రూ.లక్షల్లో డొనేషన్లు తీసుకున్నాయి. అధిక ఫీజులు ఉన్నాయి. వాటికి ఫీజులు పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఇక నియంత్రణ ఎక్కడుంది. శాస్త్రీయత ఎక్కడుంది. పాఠశాలల ఆదాయంలో 50 శాతాన్ని టీచర్లకు వేతనాలుగా ఇవ్వాలన్న అంశాన్ని పట్టించుకోలేదు. తల్లిదండ్రులకు, టీచర్లకు రక్షణ లేదు. మరణ శాసనం రాశారు. ఈ నివేదికను మేం ఖండిస్తున్నాం..
    – ఆశిష్‌ నేరెడి, హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ 

ఫీజుల తగ్గింపునకు చర్యలేవీ?
ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన దారుణం. ఇప్పటికే లక్షల్లో ఫీజులు దండుకుంటుకున్న కార్పొరేట్‌ స్కూళ్లకే అది మేలు చేస్తుంది. ఫీజుల నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ లేకుండా జోనల్‌ కమిటీల వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రైవేట్‌ స్కూళ్ల విధివిధానాలపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో–1లోని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. దీంతో విద్యా వ్యాపారం ఇంకా పెరుగుతుంది. ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి. మూడేళ్లకోసారి ఫీజులు నిర్ణయించాలని గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలి..
– నాగటి నారాయణ, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం  

కమిటీ నివేదికలో ప్రధాన అంశాలివీ.. 
 ద్రవ్యోల్బణం ప్రకారం ఏటా గరిష్టంగా 10 శాతం వరకు ఫీజులను పెంచుకోవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 
 10 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. ఇందుకు జెడ్‌ఎఫ్‌ఆర్‌సీలను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు వాటికి ఆడి ట్‌ నివేదికలను అందజేసి, అనుమతి తీసుకోవాలి. 
 స్కూళ్లు 10 శాతం ఫీజులు పెంచినా, పెంచకపోయినా.. ఎక్కువ లాభాలు గడిస్తున్నట్లయితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. 
 అనధికారికంగా ఫీజులను పెంచితే జిల్లాల్లో డీఈవోకు, కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి. 
 అన్ని పాఠశాలల ఆడిట్‌ చేసిన ఆదాయ, వ్యయాల లెక్కలను ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టాలి. 
ఇలా వివరాలను అందుబాటులోకి తీసుకురాని స్కూళ్లకు ఆ ఏడాది ఫీజుల పెంపునకు అనుమతించవద్దు. తర్వాతి ఏడాది కూడా వివరాలు బహిరంగపర్చకపోతే వాటి గుర్తింపును రద్దు చేయాలి. 
 తప్పుడు ఆడిట్‌ నివేదికలను పొందుపరిస్తే విద్యాశాఖ ఏక సభ్య కమిషన్‌తో విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. 
 2016–17 విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ఫీజులే ప్రామాణికంగా కొత్త ఫీజుల విధానం ఉంటుంది. 
 ఇప్పుడున్న ఫీజులను పెంచినా, పెంచకపోయినా.. ప్రస్తుతం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు చేపట్టవచ్చు. 
 డొనేషన్లు, అడ్మిషన్‌ ఫీజులు వసూలు చేయవద్దు. 
 ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. 
 పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి సంబంధిత బోర్డుల నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement