సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు ఫీజుల భారం తప్పేలా లేదు. పాఠశాలలు ఏటా 10 శాతం ఫీజులు పెంచుకోవచ్చంటూ ఫీజులపై అధ్యయనం చేసిన తిరుపతిరావు కమిటీ స్పష్టం చేయడమే ఇందుకు కారణం. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా... అందుకు భిన్నంగా తిరుపతిరావు కమిటీ నివేదిక రూపొందించడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఫీజులపై కమిటీ రూపొందించిన నివేదికను శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు అందజేశారు. మరోవైపు తిరుపతిరావు కమిటీ తమ నివేదికలో శ్లాబుల విధానాన్ని సైతం సూచించినట్లు తెలిసింది. ఎల్‌కేజీ, యూకేజీలకు ఒక శ్లాబు, 1–5వ తరగతి వరకు మరో శ్లాబు, 6–10తరగతి వరకు మరో శ్లాబుగా విభజించినట్లు సమాచారం. శ్లాబుల ఆధారంగా ఫీజులు నిర్ణయించే వెసులుబాటును పాఠశాల యాజమాన్యాలకు కల్పించినట్లు తెలియవచ్చింది. అయితే కమిటీ నివేదికను నిలిపివేయాలని ప్రైవేటు స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్‌కు వినతిపత్రం సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment