తడిసి మోపెడు
►తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్న జూన్
►ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం
►కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత
►సామాన్యులకు భారంగా చదువులు
జూన్ నెలను తలచుకుంటేనే తలిదండ్రులకు గుండె గుభేల్ మంటోంది. పిల్లలను పాఠశాలలో చేర్పించాలంటే రూ. 20 నుంచి 40 వేల దాకా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలను పాఠశాలల వారే విక్రయిస్తున్నారు అప్పులు చేసి మరీ చదువుకు ఖర్చుచేయక తప్పడం లేదంటున్నారు తల్లితండ్రులు.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కాన్వెంట్లలో చదివించాలని భావిస్తున్నారు. దీనిని ఆదునుగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఏటా ఫీజులు భారీగా పెంచుతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో పేద, బడుగు, బలహీల వర్గాల వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
పాఠశాలలోనే అమ్మకాలు:
విద్యార్థులు చేరిన పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, టై కొనాల్సిన పరిస్థితి. కారణం వారి స్కూల్ లోగోలు బెల్టులు, బ్యాడ్జీలు, టైలు, చివరకు నోట్ çపుస్తకాలపైన ఉంటాయి. దీంతో తప్పనిసరిగా ఆక్కడ కొనాల్సిందే. ఇది వారికి వ్యాపారంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
జాడలేని రిజర్వేషన్లు:
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పేదవారికి 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. అధికారులు ఇవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలందరికి ఉచిత విద్యనందించాలని విద్యాహక్కుచట్టం చెబుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యనిందిచాల్సి ఉంది. కా>నీ వాటిని పాటించే పాఠశాలలు మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.
కానరాని ప్రభుత్వం నియంత్రణ:
ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది.దీంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజులను విపరీతంగా పెంచుతున్నాయి. ఇది పేద, మధ్య తరగతి తల్లితండ్రులకు అర్థిక భారంగా మారుతోంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారమైనా అప్పు చేసి చదివించుకోక తప్పడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచైనా ఫీజులు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.