మెరుగైన విద్య పేరుతో మోసం
Published Sat, Jul 1 2017 12:39 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
- స్కూల్ మూసివేసి ఫీజులతో ఉడాయించిన ఘనుడు
- టంగుటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
బనగానపల్లె రూరల్ : ఎక్కడో గుంటూరు నుంచి వచ్చాడు.. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు స్కూలును లీజ్‌కు తీసుకున్నాడు. మెరుగైన విద్యనందించి మీ పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దుతామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మి బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామస్తులు వాసులు సుమారు 65 మంది వరకు పిల్లలు చేర్పించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు మొదటి విడత స్కూలు ఫీజులు కూడా చెల్లించారు. అంతా వసూలు చేసిన సదరు వ్యక్తి స్కూలు వదిలి ఉడాయించాడు. స్థానికుల వివరాల మేరకు..టంగుటూరుకు చెందిన సుబ్బరాముడు గతంలో గ్రామంలో ప్రతిభ ఇంగ్లీషు మీడియం స్కూల్ ప్రారంభించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాదరెడ్డి ఈ ఏడాది పాఠశాలను తీసుకున్నాడు.
జూన్ నెలలో అడ్మిషన్లు ప్రారంభించారు. నర్సరి నుంచి 5వ తరగతి వరకు సుమారు 65 మంది పిల్లలను చేర్పించుకునిఅడ్మిషన్ ïఫీజు రూ.500, టర్మ్ ఫీజు కింద రూ. 2వేల నుంచి రూ. 3 వేల ప్రకారం రూ.2.50 లక్షల వరకు వసూలు చేశాడు. పలుకూరులో మరో బ్రాంచి ఏర్పాటు చేస్తున్నామంటూ గురువారం స్కూల్లోని పర్నీచర్, ఇంటి సమాన్లను ఆటోల్లో తరలించారు. సాయంత్రం స్కూల్ వదలిన తరువాత ప్రసాదరెడ్డి భార్య కూడా పలుకూరుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రసాదరెడ్డి, ఆయన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.
24న పాఠశాల తనిఖీ
టంగుటూరులోని ఈ పాఠశాలను ఎంఈఓ స్వరూప గత నెల 24న తనిఖీ చేశారు. గుర్తింపు లేనట్లు నిర్ధారించి హెచ్చరించి వెళ్లారు. దీంతో ప్రసాద్‌రెడ్డి పాఠశాల గుర్తింపు కోసం ప్రయత్నించి కుదరకపోవడంతో వెళ్లిపోయి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇక్కడ స్కూల్ నడిపిన సుబ్బరాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రసాదరెడ్డి ఆచూకీ విచారిస్తున్నట్లు తెలిసింది.
Advertisement