- ట్రాన్స్‌కో అభ్యంతరాలు బుట్టదాఖలు
- ప్రజలపై విద్యుత్ భారం ఖాయం
సాక్షి, హైదరాబాద్: పవర్ రేసులో పరుగెత్తడమే లక్ష్యంగా ప్రభుత్వం హిందూజా సంస్థ గొంతెమ్మ కోర్కెలకు సర్కారు తలూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే హుకుం జారీ చేయడంతో ఏపీ ట్రాన్స్‌కో ఈ నెల 30వ తేదీకల్లా ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సిద్ధమైంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారం తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
హిందూజా డిమాండ్లను ఏపీ ట్రాన్స్‌కో మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. దీంతో యాజమాన్యం నేరుగా ప్రభుత్వం పెద్దలను ఆశ్రయించి వారిని సంతృప్తి పరచడంతో హిందూజా కోరినట్టు పీపీఏలు చేసుకోవాలని ట్రాన్స్‌కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.1040 మెగావాట్ల హిందూజా తాజాగా ఒక యూనిట్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పాత పీపీఏలను పక్కనబెట్టి, కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చింది. స్థిర వ్యయం రూ. 1.75 వరకూ ఇవ్వాలని ప్రతిపాదించింది.
75 శాతం విద్యుత్‌ను బయట అమ్ముకోవడానికి అనుమతి కోరింది.దీనికి అధికారులు ససేమిరా అనడంతో 100 శాతం విద్యుత్ రాష్ట్రానికే ఇవ్వడానికి ఒప్పుకుంది. సంస్థ కోరిన యూనిట్ కాస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని ట్రాన్స్‌కో అడ్డుపడింది. దీంతె ప్రభుత్వాన్ని ఆశ్రయించి ట్రాన్స్‌కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూనిట్ రూ. 1.50లకు విద్యుత్ కొనుగోలుకు స్థిర ఛార్జీ నిర్ణయించే వీలుంది. స్థిర, చర వ్యయాన్ని లెక్కిస్తే యూనిట్ రూ. 15 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని విద్యుత్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు.