
వస్తుందో... రాదో!
అటువైపు గవర్నర్ గిరి కనిపిస్తోంది...అయితే, అదెప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని సందిగ్ధ పరిస్థితి. ఇటువైపు ఎంపీ సీటు ఇస్తామని కబురు చేస్తున్నారు... తీరా వెళ్లాక ఇస్తారో లేదోనని బెంగ...ఓ మాజీ మంత్రివర్యులు ఈ సంగతిని ఎటూ తేల్చుకోలేక తెగ సతమతమవుతున్నారు. టీడీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఒంటికాలితో లేచిన వీర టీడీపీ తెలంగాణ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. కానీ, నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం కేసులో టీడీపీ ఇరుకునపడటం ఈ మాజీ మంత్రికి మింగుడుపడటం లేదు. ఈ వ్యవహారం తెలంగాణలో పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఆయన సన్నిహితులతో వాపోయారు.
ఇదే మాటను టీఆర్‌ఎస్‌లో ఉన్న ఓ నేతతో కూడా పంచుకున్నారు. ఆ నోటా ఈ నోటా ఇది బయటకు పొక్కింది. సదరు మాజీ మంత్రి పార్టీలో చేరితే ఎంపీ సీటు ఇస్తామంటూ టీఆర్‌ఎస్ నుంచి ఫీలర్లు కూడా వచ్చాయి. మరి గవర్నర్ గిరి వస్తుంటే ఎంపీ ఎందుకు...అన్నది సదరు నేత ఆలోచన. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతుందా...గవర్నర్ గిరికి ప్రధాని ఒప్పుకుంటారా అన్న పునరాలోచన కూడా చేస్తున్నారు. ఈ మధ్యలోనే టీఆర్‌ఎస్ తీర్థం అన్న వార్తలు వ్యాప్తి చెందాయి...గవర్నర్ గిరి...ఎంపీ టికెట్ ఏది మంచిదో...ఏది చెడ్డదో...ఏ పరిణామాలు ఎటు దారితీస్తాయో అంటూ ఆయన మథనపడుతూనే ఉన్నారు.